విద్వేషం అభివృద్ధికి శత్రువు: రాహుల్‌

విద్వేషం, హింస అనేవి అభివృద్ధికి శత్రువులని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం ఈశాన్య దిల్లీలో ఘర్షణలు చోటుచేసుకున్న పలు ప్రాంతాలను కాంగ్రెస్ నాయకులు రెండు బృందాలుగా వెళ్లి సందర్శించారు.

Published : 05 Mar 2020 00:25 IST

దిల్లీ: విద్వేషం, హింస అనేవి అభివృద్ధికి శత్రువులని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం ఈశాన్య దిల్లీలో ఘర్షణలు చోటుచేసుకున్న పలు ప్రాంతాలను కాంగ్రెస్ నాయకులు రెండు బృందాలుగా వెళ్లి సందర్శించారు. ఒక బృందానికి రాహుల్‌గాంధీ నేతృత్వం వహించారు. ఇందులో భాగంగా రాహుల్‌ గాంధీ బ్రిజ్‌పురిలో అల్లర్లలో పూర్తిగా ధ్వంసమైన ఓ పాఠశాలను సందర్శించారు. మంటల్లో దగ్ధమైన తరగతులను, బస్సులను పరిశీలించారు. పరిశీలన అనంతరం రాహుల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పాఠశాల అనేది భారత భవిష్యత్తు. విద్వేషం, హింస వచ్చి వాటిని నాశనం చేశాయి. ఇలాంటి వాటి వల్ల ఎవరికీ లాభం ఉండదు. విద్వేషం, హింస అనేవి అభివృద్ధికి శత్రువులు. విభజన వ్యాప్తి చేయడం వంటి పనులు భారతమాతకు ప్రయోజనం చేకూర్చవు’ అని పేర్కొన్నారు. 

కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా గాంధీ దిల్లీ అల్లర్ల పరిస్థితి పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరుతూ గత వారం ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల ఈశాన్య దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో సీఏఏ కారణంగా అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో 42 మంది మరణించగా.. 200 మంది గాయాల పాలయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని