‘ఒక్కొక్కరూ ఆరుగుర్ని కనండి’

ప్రతి మహిళా ఆరుగురికి జన్మనివ్వాలని వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్‌ ముదురో విజ్ఞప్తి చేశారు. దేశం బాగు కోసం పిల్లల్ని కనాలని సూచించారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న....

Published : 06 Mar 2020 02:24 IST

కారాకస్‌ (వెనుజువెలా):  దేశంలోని ప్రతి వివాహిత మహిళ ఆరుగురికి జన్మనివ్వాలని వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురో విజ్ఞప్తి చేశారు. దేశం బాగు కోసం పిల్లల్ని కనాలని సూచించారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్షుడు ఇలా పిలుపునివ్వడంపై ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.

జాతీయ మహిళా ఆరోగ్య కార్యక్రమంపై ఓ టీవీ కార్యక్రమంలో మదురో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రతి ఒక్క మహిళా ఆరుగురేసి బిడ్డలకు జన్మనివ్వాలని కోరారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై ఆయన మద్దతుదారులు సైతం అసహనం వ్యక్తంచేశారు. ‘దేశంలో ఆస్పత్రులు పనిచేయడం లేదు. వ్యాక్సిన్లు దొరకడం లేదు. పౌష్టికాహార లోపంతో పిల్లలకు చనుబాలు కూడా ఇవ్వలేని స్థితిలో తల్లులు ఉన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో మదురో పాలన చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేనట్లు ఉంది’’ అని  జాతీయ అసెంబ్లీ సభ్యుడు మనుయెలా బొలివర్‌ ట్వీట్‌ చేశారు. దేశంలో పుట్టిన చిన్నారులకే బతుకుతారో లేదో తెలియని పరిస్థితుల్లో ఇలా పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యమని మానవహక్కుల కార్యకర్త ఒకరు మండిపడ్డారు.

కొన్నేళ్లుగా వెనుజువెలా ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2015 నుంచి ఇప్పటి వరకు 45 లక్షల మంది వెనుజువెలా పౌరులు ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. 93 లక్షల మంది పౌరులు తమ కనీస అవసరాలకు నోచుకోవడం లేదని లెక్కలు చెబుతున్నాయి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని