17రెట్ల వేగంతో కరోనా విజృంభన..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ చైనాకు వెలుపల 17రోట్ల వేగంతో వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో దీని వ్యాప్తిని అరికట్టాలని ప్రపంచదేశాలకు సూచించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 330మంది ప్రాణాలు కోల్పోగా 98వేల మందికి ఇది వ్యాపించింది.

Updated : 06 Mar 2020 19:12 IST

జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్‌ చైనాకు వెలుపల 17రెట్ల వేగంతో వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో అరికట్టాలని ప్రపంచదేశాలకు సూచించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3300మందికిపైగా ప్రాణాలు కోల్పోగా 98వేల మంది దీని బారినపడ్డారు. కేవలం చైనాలోనే 3042మంది చనిపోగా తాజాగా మరో 30మరణాలు సంభవించాయి.

తక్కువ ఉష్ణోగ్రతలతో భయంలేదు: ఐసీఎమ్‌ఆర్‌

భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 31కి చేరింది. ఈ సమయంలోనే దేశంలో కొన్నిప్రాంతాల్లో వాతావరణం చల్లబడడంతో కరోనా వైరస్‌ మరింత విజృంభిస్తుందనే ఆందోళన ప్రజల్లో ఎక్కువైంది. అయితే ఇలాంటి వాతావరణ మార్పులకు, కరోనా వ్యాప్తి విజృంభనకు సంబంధంలేదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) వెల్లడించింది. వాతావరణంలోని మార్పులు కరోనా వైరస్‌ని ప్రభావితం చేయవని తెలిపింది. తక్కువ ఉష్ణోగ్రతల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారం లేదని ఐసీఎమ్‌ఆర్‌ డైరక్టర్‌ జనరల్‌ బలరాం బార్గవ స్పష్టం చేశారు. ఈ వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందదని, వైరస్‌ సోకిన వారితో అత్యంత సన్నిహితంగా మెలగడం వల్ల మాత్రమే ఇది వ్యాపిస్తుందని పేర్కొన్నారు. దిల్లీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడడంతో ప్రజల్లో దీనిపై అనుమానాలు ఎక్కువైన నేపథ్యంలో ఐసీఎమ్‌ఆర్‌ తాజా ప్రకటన చేసింది. 

ఐక్యరాజ్యసమితి ఉద్యోగికి కరోనా:

యూఎన్‌: ప్రపంచంలో దాదాపు 85దేశాల్లో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం తాజాగా ఐక్యరాజ్యసమితికి తాకింది. ఐక్యరాజ్యసమితిలో పనిచేస్తున్న బ్రిటన్‌కు చెందిన 33ఏళ్ల మహిళా ఉద్యోగికి కరోనా వైరస్‌ నిర్ధారణ అయినట్లు యూఎన్‌ వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి ఉద్యోగుల్లో ఇదే మొదటి కేసు అని, అయినప్పటికీ అన్ని విభాగాలను అప్రమత్తం చేసి అత్యవసర నియామాలను పాటిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం వైరస్‌ సోకిన వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నట్లు, ఆమెతో పాటు సన్నిహితంగా ఉన్నవారిని కూడా పరిశీలనతో ఉంచినట్లు తెలిపింది. 

830 కోట్ల డాలర్లు కేటాయించిన అమెరికా

వాషింగ్టన్‌: అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే అమెరికాలో కరోనాతో 12మంది మరణించగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే, కరోనాను ఎదుర్కొనేందుకు 830కోట్ల డాలర్ల  ప్రత్యేక నిధిని కేటాయిస్తూ అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకు ఇరుపక్షాల మద్దతుతో సెనేట్‌ ఆమోదం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని