గత ఐదేళ్లలో మేం ఓడింది దీంట్లోనే..: గడ్కరీ

గత ఐదు నెలల్లో తమ ప్రభుత్వం విఫలమైన అంశాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడంలో తన శాఖ తీవ్రంగా విఫలమైందని పేర్కొన్నారు.......

Published : 07 Mar 2020 00:22 IST

ముంబయి: గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం విఫలమైన అంశాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్ని తగ్గించడంలో తన శాఖ తీవ్రంగా విఫలమైందని పేర్కొన్నారు. గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2018 రోడ్‌ స్టాటిస్టిక్స్‌ నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో భారత్‌ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉండడం విచారకరమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో జరుగుతున్న ప్రమాదాల్లో 11 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని తెలిపారు. ఈ అంశంలో భారత్‌ చాలా దయనీయ స్థితిలో ఉందన్నారు. ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిలో 1.5లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల మన దేశ జీడీపీలో రెండు శాతం నష్టపోతున్నామన్నారు. 2018 నివేదిక ప్రకారం ప్రతి గంటకి 53 ప్రమాదాలు సంభవిస్తుండగా.. 17 మంది మృత్యువాతపడుతున్నారని వెల్లడించారు.

జాతీయ రహదారుల సంఖ్యని పెంచాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్భంగా గడ్కరీ నొక్కిచెప్పారు. దేశంలో 52లక్షల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయని.. వీటిలో కేవలం 96వేల కి.మీ మాత్రమే జాతీయ రహదారులన్నారు. 40శాతం ట్రాఫిక్‌ కేవలం రెండు శాతం రోడ్లపై తిరుగుతోందని వెల్లడించారు. జాతీయ రహదారులను రెండు లక్షల కిలోమీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వచ్చే ఐదేళ్లలో 80శాతం ట్రాఫిక్‌ రహదారులపైనే ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దేశ రోడ్‌ నెటవర్క్‌లో 1.94శాతంగా ఉన్న జాతీయ రహదారులపై 30.2శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని గడ్కరీ వెల్లడించారు. రాష్ట్రాల పరిధిలో ఉండే రహదారులపై 25.2శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోని రోడ్లపై 40శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 18-60 మధ్య వయస్సులో ఉన్నవారే ఈ ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని