
కరోనాపై బిల్‌గేట్స్-అబుదాబి యువరాజు పోరు!
కరోనాపై బిల్‌గేట్స్-అబుదాబి యువరాజు పోరు
అబుదాబి: అబుదాబి యువరాజు షేక్ మహ్మద్‌బిన్ జాయోద్ అల్ నహ్యన్ కరోనాను ఎదుర్కోవడానికి బిల్ గేట్స్‌తో కలిసి పనిచేయాలని నిశ్చయించుకున్నారు. ఇదే విషయమై బిల్‌గేట్స్ ఫోన్లో చర్చించానని తాజాగా ట్విటర్లో పేర్కొన్నారు. కరోనాతో పాటు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధులను ఎదుర్కోవడానికి పూర్తి సహకారం అందిస్తానని తన ఆప్తమిత్రుడు బిల్‌గేట్స్ కలిసి చర్చించానని వెల్లడించారు. దీనికోసం అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు కంపెనీలతో కలిసి పనిచేయాల్సిన అవసరాల్ని చర్చించామని తెలిపారు. ఇద్దరిమధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయని, ఇవి రానున్న రోజుల్లో కూడా కొనసాగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే అబుదాబిలో 27కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఇరాన్ విదేశాంగశాఖ మాజీ సలహాదారుడు మృతి
ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా వైరస్‌తో ఇరాన్లో ఇప్పటికే 124మంది ప్రాణాలు కోల్పోగా, 3513మంది దీని బారినపడ్డారు. వీరిలో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం విచారించదగ్గ విషయం. తాజాగా ఆ దేశ విదేశాంగశాఖ మాజీ దౌత్యవేత్త, సలహాదారుడు షేక్ హాలెస్లామ్ కరోనా వైరస్‌తో మరణించారు. చైనా వెలుపల అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి.
వాటికన్ సిటీలో..:
వాటికన్ నగరంలో కూడా మొదటి కరోనా కేసు నమోదయ్యింది. పోప్ ఫ్రాన్సిస్ సందర్శకోసం ఇక్కడకు విదేశీయుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యే జలుబుతో బాధపడుతున్న పోప్‌నకు కూడా కరోనా సోకినట్లు అనుమానించారు. దీంతో పలు కార్యక్రమాలు కూడా రద్దు చేసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం పోప్ ఫ్రాన్సిస్‌కు కరోనా సోకలేదని నిర్ధారించారు. ఇదిలా ఉంటే, వాటికన్ నగరానికి ఆనుకొని ఉన్న ఇటలీలో ఇప్పటికే కరోనా కారణంగా 52మంది మరణించగా, 2వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
సామ్సంగ్ కార్యకలాపాలు నిలిపివేత
సియోల్: ప్రముఖ మొబైల్‌ఫోన్ కంపెనీ సామ్సంగ్ దక్షిణకొరియాలోని గుమీ నగరంలోఉన్న తమ ఉత్పత్తి కేంద్రాన్ని నిలిపివేసింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా నిర్ధారణ కావడంతో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు సామ్సంగ్ వెల్లడించింది. ఇదే కంపెనీలో గతంలో ఆరుగురికి కరోనా సోకిన నేపథ్యంలో గత నెలలో కూడా కంపెనీ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది.
అప్రమత్తమైన భారత ఆర్మీ:
దిల్లీ: కరోనా వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో భారత సైన్యం కూడా ముందస్తు చర్యలు చేపట్టింది. అత్యవసరమైతే తప్ప, సైన్యం ఎక్కువ సంఖ్యలో ఒకే దగ్గర గుమిగూడకుండా చూడాలని సైన్యాధికారులకు సూచించింది. ప్రభుత్వ సూచనలతో మరిన్ని ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తామని పేర్కొంది. వీటికోసం సికింద్రాబాద్, చెన్నై, కోల్‌కతా, సూరత్‌ఘడ్, జైసల్మెర్ ప్రాంతాలను గుర్తించామని తెలిపింది.