సౌదీ రాజ కుటుంబంలో కీలక వ్యక్తులు అరెస్ట్‌!

సౌదీ అరేబియా రాజకుటుంబానికి చెందిన ముగ్గురు కీలక వ్యక్తుల్ని అక్కడి అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు సీనియర్‌ యువరాజులు ఉన్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ పత్రికలు ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్’‌, ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొన్నాయి........

Updated : 17 Oct 2022 15:05 IST

రియాద్‌: సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందిన ముగ్గురు కీలక వ్యక్తుల్ని అక్కడి అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు యువరాజులు ఉన్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ పత్రికలు ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్’‌, ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొన్నాయి. రాజు సల్మాన్‌ సోదరుడు ప్రిన్స్‌ అహ్మద్‌ బిన్‌ అబ్దులాజీజ్‌ అల్‌-సౌద్‌, ఆయన కుమారులు మహ్మద్‌ బిన్‌ నాయెఫ్‌, నవాఫ్‌ బిన్‌ నాయెఫ్‌ను వారి నివాసాల నుంచి రాయల్‌ గార్డ్స్‌ శుక్రవారం అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు సదరు పత్రికలు వెల్లడించాయి. వీరిపై రాజద్రోహం అభియోగాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

అధికారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడానికే యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌(ఎంబీఎస్‌) ఈ చర్యలకు పాల్పడుతున్నారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. గతంలోనూ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రాజకుటుంబానికి చెందిన వారిని అరెస్టు చేయించారు. 2017లో ఎంబీఎస్‌ నుంచి అధికారం లాక్కునేందుకు వీరంతా కుట్ర పన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జర్నలిస్ట్‌ ఖషోగ్గి హత్య నేపథ్యంలో యువరాజుపై తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అదనుగా చేసుకొని రాజు సల్మాన్‌ సోదరుడు ప్రిన్స్‌ అహ్మద్‌ అధికారాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించారన్న వార్తలు వచ్చాయి. ఈ మేరకు ఎంబీఎస్‌ అహ్మద్‌కు లొంగిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు కూడా ప్రచురించాయి. దీన్ని ఏమాత్రం సహించని యువరాజు వారిపై చర్యలకు ఉపక్రమించారు. నాటి నుంచే అరెస్టుల పర్వం మొదలైంది. 

తనను ఎదిరించిన వారికి తాజా అరెస్టులతో ఎంబీఎస్‌ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారని అమెరికాకు చెందిన ప్రముఖ విదేశీ వ్యవహారాల నిపుణుడు బెక్కా వాసర్‌ అభిప్రాయపడ్డారు. ఓవైపు కరోనా భయాలు.. మరోవైపు చమురు ధరలు పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ అరెస్టులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. సౌదీ నుంచి అనేక దేశాలకు చమురు ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని