డబ్బులివిగో.. ‘కరోనా’తో జర జాగ్రత్త!

చైనాలో విజృంభించిన ప్రాణాంతక మహమ్మారి కరోనా యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ధాటికి దేశాల మధ్య వాణిజ్యం స్తంభించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాలపై దెబ్బ పడింది. ఈ వైరస్‌ ........

Updated : 09 Mar 2020 17:22 IST

ఒక్కో ఉద్యోగికి రూ.21 వేలిచ్చిన జపాన్‌ కంపెనీ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలో విజృంభించిన ప్రాణాంతక మహమ్మారి కరోనా (కొవిడ్‌ 19) యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని ధాటికి దేశాల మధ్య వాణిజ్యం స్తంభించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాలపై దెబ్బ పడింది. ఈ వైరస్‌ కోరలు చాస్తున్న వేళ జపాన్‌ అప్రమత్తమైంది. ఉద్యోగులు ఒకేచోట గుమిగూడకుండా నిరోధించేందుకు ఆ దేశంలోని అనేక కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం అనేక కార్యక్రమాలను రద్దుచేసుకుంటున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ తద్వారా కొవిడ్‌ నియంత్రణకు అడ్డుకట్టవేసేలా కృషిచేస్తున్నాయి. తాజాగా, జపాన్‌లోని ఓ కంపెనీ అయితే, మరో అడుగు ముందుకేసి వైరస్‌ నుంచి ఉద్యోగుల సంరక్షణకు మరింత ప్రాధాన్యమిచ్చేలా మాస్క్‌లు, శానిటైజర్ల కోసం ఒక్కొక్కరికి 30వేల యెన్‌లు (దాదాపు రూ.21వేలు) చొప్పున పంపింది. దీంతో పాటు ఓ లేఖను కూడా జత చేసింది. ఈ కష్ట సమయంలో ఉద్యోగులు చేస్తున్న శ్రమను లేఖలో అభినందించింది.  ఫేస్‌ మాస్క్‌లు, శానిటైజర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఉద్యోగులు ఈ మొత్తాన్ని వాటి కొనుగోలుకు వినియోగించాలని సూచించింది. జపాన్‌లో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారినపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 488 కేసులు నమోదయ్యాయి. 

దాదాపు 80కి పైగా దేశాలకు కరోనా వ్యాపించింది. ఇప్పటిదాకా కరోనా బారినపడి ప్రపంచ వ్యాప్తంగా 3816 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,09,271 మంది కరోనా సోకడంతో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా 3119 మంది చైనాలోనే ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత ఇటలీలో 366 మంది మృతి చెందారు. భారత్‌లో ఇప్పటివరకు 43 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

14 దేశాల ప్రజల రాకపై ఖతర్‌ తాత్కాలిక నిషేధం
కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌ సహా మరో 13 దేశాల పర్యాటకుల ప్రవేశంపై ఖతర్‌ తాత్కాలిక నిషేధం విధించింది. భారత్‌, బంగ్లాదేశ్‌, చైనా, ఈజిప్ట్‌, ఇరాన్‌, ఇరాక్‌, లెబనాన్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, దక్షిణ కొరియా, శ్రీలంక, సిరియా, థాయిలాండ్‌ నుంచి వచ్చే పర్యాటకులు తమ దేశంలోకి రాకపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో ఖతర్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఇటలీలో 16మిలియన్ల మందిపై ఆంక్షలు
ఇటలీలో దాదాపు మూడోవంతు మంది ప్రజలపై అక్కడి ప్రభుత్వం  ఆంక్షలు విధించింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రజల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సి వస్తోందని ఇటలీ ప్రధాని జిస్సెప్పే కాంటీ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుపై ఆయన నిన్న సంతకం చేశారు. ఒకరోజు వ్యవధిలో 1492 కొత్త కేసులు వెలుగు చూడడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షల కారణంగా ఒక ప్రదేశం నుంచి మరో చోటుకు వెళ్లడానికి ప్రజలకు అవకాశం ఉండదు. బహిరంగ వేడుకలు నిర్వహించుకునే వీలుండదు. ఇటలీలో ఇప్పటివరకు 366 మంది మృత్యువాత పడ్డారు.  7375 కేసులు నమోదయ్యాయి. చైనా, దక్షిణ కొరియా తర్వాత అత్యధిక కేసులు ఇక్కడే నమోదు కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని