దిల్లీ అల్లర్ల కేసు: మరో ఇద్దరి అరెస్టు

దిల్లీ అల్లర్ల కేసులో తాజాగా పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) అనే ఇస్లామిక్‌ సంస్థ దిల్లీ చీఫ్‌ పర్వేజ్‌ అహ్మద్‌తో పాటు, కార్యదర్శి మహ్మద్ ఇలియాస్‌లను దిల్లీ......

Published : 12 Mar 2020 16:53 IST

దిల్లీ: దిల్లీ అల్లర్ల కేసులో పోలీసులు  తాజాగా  మరో ఇద్దరిని అరెస్టు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సంస్థ దిల్లీ చీఫ్‌ పర్వేజ్‌ అహ్మద్‌తో పాటు, కార్యదర్శి మహ్మద్ ఇలియాస్‌లను దిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసుల అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తులు దిల్లీ అల్లర్లకు నిధులను సమకూర్చినట్లు గుర్తించామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిన్న లోక్‌సభలో ప్రకటించిన నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దిల్లీలో జరిగిన అల్లర్ల సమయంలో ప్రజలను ప్రేరేపించినందుకు మహ్మద్ ఇలియాస్‌, పర్వేజ్‌ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీనియర్‌ పోలీస్ అధికారి తెలిపారు. అంతేకాకుండా అల్లర్లకు నిధులు సమకూర్చడంలో వారి పాత్ర ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనలకు నిధులు సమకూర్చారన్న ఆరోపణలతో దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పీఎఫ్ఐపై దృష్టి సారించారు. బుధవారం ఈ కేసులో ఆప్‌ మాజీ నాయకుడు తాహిర్‌ హుస్సేన్‌, పీఎఫ్‌ఐపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇటీవల ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. 

అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తాం: పీఆర్వో 

దేశ రాజధాని నగరంలో శాంతిభద్రతలు సాధారణంగానే ఉన్నాయని దిల్లీ పోలీసులు స్పష్టంచేశారు. ఈశాన్య దిల్లీ నుంచి అన్ని పీసీఆర్‌ కాల్స్‌ను సునిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. సీఏఏ అంశంపై ఇటీవల ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లలో ఇప్పటి వరకు 712 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు దిల్లీ పోలీసుల పీఆర్వో ఎంఎస్‌ రాండ్వా వెల్లడించారు. 200 మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. అల్లర్లకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ఫేస్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. అన్ని కోణాల్లోనూ దీనిపై దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని