కరోనా దెబ్బ: అనవసర ప్రయాణాలొద్దు: కేంద్రం

చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) కేసులు భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ.........

Updated : 12 Mar 2020 15:23 IST

దిల్లీ: చైనాలో విజృంభించిన కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) కేసులు భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తోంది. ఇప్పటివరకు భారత్‌లో 73 కేసులు నమోదవ్వడంతో గురువారం లోక్‌సభలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కరోనాపై ప్రకటన చేశారు. ఇది ఆందోళన కల్గించే అంశమనీ.. దీన్ని బాధ్యతాయుతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదకర అంటువ్యాధిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండటమే మేలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

6000 మంది భారతీయులు ఇరాన్‌లో చిక్కుకున్నారన్న జైశంకర్‌.. వారిలో 1100 మంది మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌కు చెందిన యాత్రికులు ఉన్నారని వెల్లడించారు. అలాగే, 300 మంది విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. ఇరాన్‌లో కరోనా ప్రభావితమైన క్వామ్‌ ప్రాంతంలో చిక్కుకున్న యాత్రికులను వెనక్కి రప్పించడంపై తొలుత దృష్టిపెట్టినట్టు సభకు వెల్లడించారు. ఇరాన్‌ వ్యవస్థలో కఠిన నిబంధనలు ఉండటం వల్ల అక్కడి భారతీయులను తీసుకురావడంలో ఇబ్బందులు నెలకొన్నాయన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల సంక్షేమమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటలీకి కూడా ఒక వైద్య బృందాన్ని పంపుతున్నట్టు చెప్పారు. అక్కడ భారతీయులకు వైద్యపరీక్షల్లో నెగిటివ్‌ అని తేలితే.. వారిని భారత్‌ వెళ్లేందుకు అనుమతిస్తున్నారని తెలిపారు.

విదేశీ ప్రయాణికులు తగ్గుతున్నారు
మరోవైపు, కరోనా ప్రభావంతో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. రోజుకు సుమారు 70 వేల మంది వచ్చేవాళ్లని కానీ.. ఆ సంఖ్య 62వేలకు పడిపోయిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ లోక్‌సభలో గురువారం వెల్లడించారు. ఈ సంఖ్య మున్ముందు 40వేలకు పడిపోయే అవకాశం ఉందని తెలిపారు. దేశంలోని 30 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రోజుకు సరాసరి 70వేల మంది ప్రయాణికులు వస్తుంటారన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బుధవారం అన్ని పర్యాటకుల వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని