కరోనాను ఎలా ఎదుర్కొన్నానంటే...

ఈమె ధైర్యం కోల్పోకుండా కరోనా వైరస్‌తో వ్యవహరించిన, గెలిచిన తీరు పలువురికి ఆదర్శనీయంగా నిలుస్తోంది. 

Updated : 12 Mar 2020 16:13 IST

కరోనా నుంచి కోలుకున్న మహిళ అనుభవం

సియాటెల్: ప్రపంచం మొత్తం కరోనావైరస్‌ (కొవిడ్‌-1) భయంతో కకావికలమవుతోంది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని మహమ్మారిగా ప్రకటించింది. అయితే కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న ఓ 37 ఏళ్ల అమెరికన్‌ మహిళ, కరోనా భయంతో వణికిపోతున్న వారికి ఊరట కలిగించేందుకు తన అనుభవాలను వివరించారు. 

ఇలా మొదలైంది...

బయోఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్న ఎలిజబెత్‌ ష్నెయిడర్‌, వాషింగ్టన్‌ రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన సియాటెల్‌కు చెందినవారు. అమెరికాలో అతి ఎక్కువ కరోనా మరణాలు ఈ నగరంలోనే నమోదు కావటం గమనార్హం. ఓ పార్టీలో పాల్గొన్న ఎలిజబెత్‌కు మూడు రోజుల అనంతరం ఫిబ్రవరి 25న ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపించటం మొదలయ్యాయి. ఆ మధ్యాహ్నానికల్లా తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు రావటంతో మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆమె ఇంటికి వెళ్లారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఆమెకు జ్వరం మరింత తీవ్రమై 103 డిగ్రీలకు చేరుకుంది. ఫ్లూ అన్న అనుమానంతో ఆమె ఔషధాలు తీసుకుంది. కానీ ఆమె జ్వరం తగ్గుముఖం పట్టలేదు. అంతే కాకుండా ఆమెలాగే ఆ పార్టీలో పాల్గొన్న 40 శాతం మందికి కూడా అవే లక్షణాలు బహిర్గతమయ్యాయి.

నేను ఆశ్చర్యపోయా... అమ్మ ఏడ్చింది

ఈ లోగా వాషింగ్టన్‌ లో మొదటి కరోనా కేసు నమోదు కావటం గురించి ఆమెకు తెలిసింది. అయితే దగ్గు, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది వంటి సమస్యలు లేకపోవటంతో తనకు కరోనా వైరస్‌ సోకలేదని ఎలిజబెత్‌ భావించారు. ఈ నేపథ్యంలో ఫ్లూ జ్వరంపై పరిశోధన చేసే ‘సియాటిల్‌ ఫ్లూ స్టడీ’ అనే సంస్థ పరిశోదనలో పాలు పంచుకోవాలని ఎలిజబెత్‌ నిర్ణయించుకున్నారు. తద్వారా తన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కూడా ఆమె భావించారు. ఆ సంస్థ వారు పంపిన ఓ శ్వాస పరీక్షా కిట్‌లో ఎలిజబెత్‌ తన వివరాలు, నమూనాలు నమోదు చేసి వారికి తిరిగి పంపారు. చివరకు మార్చి 7న పరిశోధనా సంస్థ వారు తనకు కొవిడ్‌-19 ఉన్నట్టు ఫోన్‌ ద్వారా తెలియచేశారు. దీనితో ఆమె ఆశ్చర్యపోగా, ఆమె తల్లి మాత్రం తీవ్రంగా వేదనకు గురయ్యారు. 

చాలా మంది చేసే పొరపాటు...

అనంతరం ఆమెను కనీసం ఏడు రోజులు ఇంటికే పరిమితమై ఉండాలని వైద్యాధికారులు సూచించారు. ప్రస్తుతం కరోనా వైరస్ పూర్తిగా నయమైన 72 గంటల అనంతరం మాత్రమే ఎలిజబెత్‌ బయటకు రావటం మొదలు పెట్టారు. ‘‘భయపడ వద్దు... కొవిడ్‌-19 ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్పత్రి పాలు కానవసరంలేదు. ఏ ప్రభుత్వం ప్రజలందరినీ కరోనా అనుమానంతో అనవసరంగా బంధించదు. నా మటుకు నాకు కరోనా దానంతట అదే తగ్గిపోయింది. అయితే చాలా మంది చేసే పొరపాటు నిర్ధారణ పరీక్షలు చేయించుకోకపోవటం. దాని వల్ల మరింత మందికి ఈ వ్యాధి వ్యాప్తించేలా చేయటం. మనకు వ్యాధి ఉందని తెలిసినపుడు మరింత అప్రమత్తతతో మనంతట మనమే ఇంటికి పరిమితమై ఉండాలి. నేను చెప్పేది ఒక్కటే... ఆందోళన పడవద్దు...మీకు కరోనా ఉంది అంటే... ఉండనీయండి. దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. వైద్యులు సూచించిన ఔషధాలు తీసుకోండి. మీ ఆరోగ్య చిహ్నాలు మరీ ప్రమాదకరంగా ఉంటే తప్ప మీరు ఇంటివద్దనే ఉండవచ్చు. చాలా ఎక్కువ మంచినీరు తాగండి. పూర్తి విశ్రాంతి తీసుకోండి. చక్కగా మీకిష్టమైన టీవీ కార్యక్రమాలను చూడండి...’’ అని ఎలిజబెత్‌ ష్నెయిడర్‌ నవ్వుతూ సలహా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని