ఎన్‌పీఆర్‌కు ఏ పత్రమూ ఇవ్వక్కర్లేదు: షా

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పార్లమెంట్‌లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత దీనిపై విద్వేష ప్రసంగాలు ప్రారంభమయ్యాయని కేంద్ర  హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. సీఏఏతో పౌరసత్వం పోతుందని........

Updated : 13 Mar 2020 12:22 IST

సమాచారం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ఐచ్ఛికమే 

దిల్లీ అల్లర్లపై రాజ్యసభలో అమిత్‌ షా సమాధానం

దిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పార్లమెంట్‌లో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత దీనిపై విద్వేష ప్రసంగాలు ప్రారంభమయ్యాయని కేంద్ర  హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. సీఏఏతో పౌరసత్వం పోతుందని కొందరు అపోహలు సృష్టించి ముస్లింలను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. ఎన్‌పీఆర్‌కు ఎలాంటి పత్రమూ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. నిర్దిష్టమైన సమాచారం ఇవ్వకూడదని ఎవరైనా అనుకుంటే వారిని ఏ ప్రశ్నలూ అడగరని చెప్పారు. సమాచారం ఇవ్వడం, ఇవ్వకపోవడం ఐచ్ఛికమేనన్నారు. ఎన్‌పీఆర్‌పై ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని చెప్పారు. ఈ అప్‌డేషన్‌ ప్రక్రియలో ఎవరినీ సందేహాస్పదంగా గుర్తించరని స్పష్టంచేశారు. ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లపై ఆయన గురువారం సాయంత్రం రాజ్యసభలో సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  దిల్లీ అల్లర్ల వెనుక నిందితులు ఏ మతం, కులం, రాజకీయ పార్టీకి చెందిన వారైనా వదిలేదని లేదని మరోసారి హెచ్చరించారు. అల్లర్లకు కారణమైన నిందితులను గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. చట్టం అంటే అల్లరిమూకల్లో వణుకు పుట్టేలా భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడాలంటేనే భయపడేలా శిక్షలు ఉంటాయన్నారు. 36 గంటల్లోనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారనీ.. వారిని నిందించడం సరికాదని విపక్షాలకు సూచించారు.

ఆధార్‌ సమాచారం వాడట్లేదు
ఈ అల్లర్లలో పోలీస్‌ కానిస్టేబుల్‌, ఐబీ ఉద్యోగి హత్య వెనుక నిందితులను అరెస్టు చేసినట్టు హోంమంత్రి వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతుందన్న ఆయన ఈ కేసులో నిందితులను ఫొటో, వీడియో, ఆడియో ఆధారాలతో అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే వ్యవహరిస్తున్నామన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు గుర్తింపు కార్డుల ఆధారంగానే నిందితులను గుర్తిస్తున్నాం తప్ప, ఆధార్‌ సమాచారాన్ని ఇందుకోసం వాడటంలేదన్నారు. దీనిపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. 

అల్లర్లు ప్రేరేపించడం మా స్వభావం కాదు
దిల్లీ అల్లర్లపై చర్చ నుంచి తామేనాడూ పారిపోలేదన్న అమిత్‌ షా హోలీ ప్రశాంతంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఆలస్యం చేశామని వివరించారు. ఈ రోజు ఉదయం వరకు ఫేస్‌ రికగ్నేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా 1922 మంది ముఖాలను గుర్తించినట్టు చెప్పారు. వారిలో 336 మంది యూపీ నుంచి వచ్చినవారు ఉన్నారన్నారు. ఇప్పటివరకు 700 ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారని అమిత్‌ షా స్పష్టంచేశారు. ఈ అల్లర్ల తర్వాత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రజలే వీడియో ఫుటేజీలను పంపారని.. అల్లరి మూకలను గుర్తించేందుకు సహకరించారని తెలిపారు. ఇప్పటివరకు 2600 మందిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఫిబ్రవరి 25న జరిగిన అఖిలపక్ష సమావేశంలో దిల్లీ అల్లర్లను నియంత్రించేందుకు ఎవరూ మిలటరీని పిలవాలని సూచించలేదన్నారు. ఆ సాయంత్రంతో దిల్లీ అల్లర్లు సద్దుమణిగాయన్నారు. అల్లర్లను ప్రేరేపించడం తమ స్వభావం కాదన్న అమిత్‌ షా వాటిని నివారించడమే తమ స్వభావవమని తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని