కొనసాగుతున్న అమెరికా ప్రతీకారదాడులు

ఇరాక్‌లోని తమ వైమానిక స్థావరాలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికా ప్రతిదాడులకు దిగింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి...........

Published : 13 Mar 2020 09:50 IST

వాషింగ్టన్‌: ఇరాక్‌లోని తమ వైమానిక స్థావరాలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికా ప్రతిదాడులకు దిగింది. గురువారం సాయంత్రం ప్రారంభమైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌ మద్దతున్న ముఠాలే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నామని ఓ సైనికాధికారి తెలిపారు. అయితే ఏ ప్రాంతంలో దాడి చేస్తున్నారన్నది మాత్రం వెల్లడించలేదు. ముఠాల ఆయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతున్నామని పేర్కొన్నారు. ఇరాక్‌లో వివిధ రాష్ట్రాల్లో ఉన్న హషద్‌ అల్‌-షాబీ ముఠా స్థావరాలు, ఆయుధ నిల్వలు, డ్రోన్‌ కేంద్రాలే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నట్లు మరో అధికారికి వెల్లడించారు. వీటిలో కతెబ్‌ హెజ్బోల్లా సాయుధ ముఠా కూడా ఉందని తెలిపారు. ప్రతీకార దాడులు జరుపుతున్న విషయాన్ని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ సైతం ధ్రువీకరించింది. అంతకుముందు యూఎస్‌ రక్షణశాఖమంత్రి మార్క్‌ ఎస్పర్‌ మాట్లాడుతూ.. తమ సైనికుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న వారిపై ప్రతీకారం దాడులు తప్పవని హెచ్చరించారు. తమ ముందున్న అన్ని రకాల ప్రత్యామ్నాయాల్ని వాడుకుంటామని తేల్చిచెప్పారు. 

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరం ‘క్యాంప్‌ తాజీ’పై గుర్తుతెలియని సాయుధులు బుధవారం రాకెట్లతో విరుచుకుపడ్డారు.  దీంతో ముగ్గురు సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు అమెరికన్లు, ఒక బ్రిటన్‌ జాతీయుడు ఉన్నారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి తీవ్రతకు ఈ స్థావరంలోని భవనాలు అగ్నికీలల్లో చిక్కుకుపోయాయి. దీనికి ఇరాక్‌లో ఇరాన్‌ మద్దతున్న ముఠాలే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. అక్కడి అనేక సాయుధ ముఠాల స్థావరాలపై తాజాగా ప్రతీకార దాడులకు దిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని