విదేశీ ప్రయాణికులపై నిషేధంలేదు: జైశంకర్

కరోనా (కొవిడ్-19) వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌లోకి విదేశీ ప్రయాణికుల ప్రవేశంపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ ఒక.....

Published : 13 Mar 2020 16:38 IST

దిల్లీ: కరోనా (కొవిడ్-19) వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్‌లోకి విదేశీ ప్రయాణికుల ప్రవేశంపై ఎలాంటి నిషేధం విధించలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ ఒక ప్రకటన చేశారు. ‘‘కొన్ని దేశాల నుంచి భారత్‌కు వచ్చే విదేశీయులు క్వారంటైన్‌కు వెళ్లవలసి ఉంటుంది. అయితే,  ఇది కొన్ని సార్లు కచ్చితంగా, ఇంకొన్ని సార్లు ప్రయాణికుల ఇష్టం మేరకు ఉంటుంది. స్వదేశానికి తిరిగి వచ్చే భారతీయులు మాత్రం క్వారంటైన్‌కి రావాలి’’ అని తెలిపారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్‌ఎస్‌పీ సభ్యుడు ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్‌, ‘‘భారత్‌ మాత్రమే పూర్తి స్థాయిలో నిషేధం విధించిన దేశం’’ అన్న వ్యాఖ్యలకు బదులుగా మంత్రి ఈ ప్రకటన చేశారు.

వారికి ముందు అవకాశం

ఇటలీ, ఇరాక్‌లో చిక్కుకొన్న భారతీయులకు పరీక్షల్లో కరోనా నెగటివ్‌ అని తేలితేనే వారిని స్వదేశానికి తీసుకువస్తామని కేంద్ర విదేశాంగశాఖ తెలిపింది. ‘‘శుక్రవారం భారతీయ వైద్యుల బృందం ఇటలీ చేరుకొంది. అక్కడి భారతీయ విద్యార్థులు కరోనా నెగటివ్‌  ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారిస్తారు. అక్కడి వారికి పరీక్షలు నిర్వహించి కరోనా నెగటివ్ వచ్చిన వారికి వైద్యులు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. దాని వల్ల వారిలో కొందరు కమర్షియల్ విమానాల్లో ప్రయాణించవచ్చు’’ అని విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు. భూటాన్‌, మాల్దీవులు, ఇరాన్‌ నుంచి కూడా మాస్కుల కోసం వినతులు వచ్చాయని, వారికి సహాయం చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.

అయితే భారతీయులను స్వదేశానికి తరలించే విషయంలో కరోనా నెగటివ్‌ వ్యక్తులను మాత్రమే ముందు తీసుకొస్తామని కరోనా నోడల్ అధికారిగా నియమించిన విదేశాంగశాఖ అదనపు కార్యదర్శి దమ్ము రవి తెలిపారు. ‘‘ఇరాన్‌కు ఇప్పటికే ఒక వైద్యుల బృందం వెళ్లింది. అక్కడి నుంచి రక్త నమూనాలు వివిధ దశల్లో భారత్‌కు చేరుకుంటాయి. వాటిని పరీక్షించి కరోనా నెగటివ్‌ ఉన్న వ్యక్తులను మాత్రం ముందుగా భారత్‌కు తరలిస్తాం’’ అని తెలిపారు. దాదాపు 6000 మంది యాత్రికులు ఇరాన్‌లోని వేర్వేరు ప్రావిన్సుల్లో చిక్కుకుపోయారు. అయితే వీరిలో 120 మందిని ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో శుక్రవారం భారత్‌కు తీసుకురానున్నారు. వీరిని రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఆర్మీ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించనున్నారు. మరో 250 మంది భారతీయులను మార్చి 14న స్వదేశానికి తీసుకురానున్నారు.

కరోనా భారత్‌లో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. దానితోపాటు కొన్ని దేశాలకు ఇ-వీసా, ఆగమానంతర వీసా సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటి వరకు భారత్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 74కి చేరింది. తాజాగా మంగళవారం మరణించిన 70 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందినట్లు నిర్ధారణ అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని