70 శాతం కొత్త కేసులు ఐరోపాలోనే..!

తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) భారీగా తగ్గుముఖం పట్టింది. గురువారం కొత్తగా కేవలం ఎనిమిది కేసుల మాత్రమే నమోదయ్యాయి. ...

Updated : 13 Mar 2020 15:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) భారీగా తగ్గుముఖం పట్టింది. గురువారం కొత్తగా కేవలం ఎనిమిది కేసుల మాత్రమే నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 80,813కు చేరింది. ఇక మరో ఏడు మంది మృతిచెందడంతో మరణాల సంఖ్య 3,176ను తాకింది. వైరస్‌ వ్యాప్తి భారీగా తగ్గుముఖం పట్టడంతో వుహాన్‌లో ప్రయాణాలపై ఉన్న ఆంక్షల్ని కాస్త సడలించారు. మరోవైపు దక్షిణకొరియాలో కొత్తగా వైరస్‌ సోకిన వారికంటే కోలుకొని ఇళ్లకు చేరుతున్న వారి సంఖ్య పెరిగడం విశేషం. గురువారం కొత్తగా 110 మంది వైరస్‌ బారిన పడగా.. మరో 177 మంది కోలుకొని ఆస్పత్రిని వీడారు. ఆ దేశంలో బాధితుల సంఖ్య 7,979కి, మృతుల సంఖ్య 67కు చేరింది. 

> యూరప్‌లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న ఇటలీలో మృతుల సంఖ్య 1016కు చేరింది. గురువారం ఒక్కరోజే 189 మంది చనిపోయారు. కొత్తగా 2651 మంది వైరస్‌ బారిన పడగా బాధితుల సంఖ్య 15 వేలు దాటింది. చికిత్సలో సాయం అందించేందుకు చైనా వైద్య బృందం ఇటలీ వెళ్లింది.

> ఇరాన్‌లో నిన్న ఒక్కరోజే 75 మంది మరణించగా.. మొత్తం సంఖ్య 429కి చేరింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాడేందుకు రూ.37వేల కోట్ల రుణం కావాలని ఇరాన్‌ ఐఎంఎఫ్‌ను కోరింది. 

> ఖతార్‌లో 262 కేసులు నమోదు కాగా, విద్యసంస్థల్ని పూర్తిగా మూసివేశారు. 

> అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా మరణాలు ఆగడం లేదు. ఇప్పటి వరకు 41 మంది మృతిచెందగా.. కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 1729కి చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సైతం కరోనా సెగ తాకింది. అన్ని ప్రచార ర్యాలీలను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. కాలిఫోర్నియాలో ప్రఖ్యాత డిస్నీలాండ్‌ పార్క్‌ను మూసివేశారు. అమెరికా వ్యాప్తంగా పండుగలు, ఉత్సవాలపై ఆంక్షలు విధించారు. అనేక రాష్ట్రాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించారు. 500 మందికంటే ఎక్కువ మంది గుమిగూడకుండా న్యూయార్క్‌లో నిషేధాజ్ఞలు విధించారు. 

> మరోవైపు ఇటీవలే డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిసిన బ్రెజిల్‌ అధికార ప్రతినిధికి సైతం కరోనా ఉన్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌ను సంవత్సరం పాటు వాయిదా వేయాలని ట్రంప్‌ కోరారు. 

> ఐరోపా దేశాలను కరోనా తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తోంది. స్పెయిన్‌లో ఉద్ధృతి పెరుగుతుండడంతో నాలుగు ముఖ్య పట్టణాలను పూర్తిగా నిర్బంధంలో ఉంచారు. దీంతో దాదాపు 66 వేల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిన్న ఒక్కరోజే 31 కేసుల అదనంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ మంత్రికి వైరస్‌ ఉన్నట్లు తేలడంతో అక్కడి మంత్రివర్గం, రాజవంశీకులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మరోవైపు బెల్జియం, రోమ్‌లలో చర్చిలను మూసివేశారు. రెండు వారాల పాటు విద్యాసంస్థల్ని మూసివేస్తున్నట్లు ఐర్లాండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. 

> కరోనాను ‘అత్యంత దారుణ ప్రజారోగ్య సంక్షోభం’గా బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. ఇప్పటివరకు ఆ దేశంలో 590 కేసులు నమోదైనప్పటికీ.. ఈ సంఖ్య ఐదు నుంచి 10 వేల మధ్య ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

> అటు దాయాది దేశం పాకిస్థాన్‌ను కరోనా కలవరపరుస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 21 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా సింధ్‌ రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థల్ని మే 31 వరకు మూసివేశారు.    

> బెంగళూరులోని గూగుల్‌ కార్యాలయంలో ఓ ఉద్యోగికి వైరస్‌ నిర్ధారణ కావడంతో దేశంలో బాధితుల సంఖ్య 75కు చేరింది. వీరిలో ఒకరు నిన్ని మరణించిన విషయం తెలిసిందే. పలు విమానాశ్రయాల్లో దాదాపు 11లక్షల 14వేల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భారీ జనం హాజరయ్యే ఐపీఎల్‌ వంటి క్రీడల నిర్వహణను అనుమతించబోమని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా అన్నారు. 

> ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో 70 శాతం యూరప్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 34 వేల మందికి పైగా సోకిన వైరస్‌ 4979 మందిని పొట్టనబెట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని