కరోనాపై ప్రభుత్వానికి సుధామూర్తి లేఖ

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు ........

Updated : 13 Mar 2020 22:13 IST

బెంగళూరు: భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టవేసేలా షాపింగ్‌ మాల్స్‌, సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె యడియూరప్ప ప్రభుత్వానికి  లేఖ రాశారు. తాజా పరిస్థితిపై నారాయణ హెల్త్‌ ఛైర్మన్‌ దేవి ప్రసాద్‌ శెట్టితో చర్చించినట్టు చెప్పారు. ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అన్ని పాఠశాలలు, కళాశాలలను తక్షణమే మూసివేయాలనీ.. మాల్స్‌, థియేటర్లుతో పాటు వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉండే ఎయిర్‌ కండిషన్‌ ప్రదేశాలను మూసివేయాలని కోరారు. అత్యవసర సర్వీసులైన ఫార్మసీ, కిరాణా, పెట్రోల్‌ బంక్‌లకు మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వంతో కలిసి తమ సంస్థ పనిచేసేందుకు సిద్ధంగా ఉందని సుధామూర్తి ప్రకటించారు. అత్యధిక ఉష్ణోగ్రతలకు ఈ వైరస్‌ బతకదనేది శాస్త్రీయంగా ఇంకా నిరూపితం కాలేదన్న ఆమె.. సింగపూర్‌, ఆస్ట్రేలియాలో ఎండలు మండుతున్నా ఈ వైరస్‌ అక్కడా వ్యాప్తి చెందడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కరోనా ప్రభావం మరింత తీవ్రతరమయ్యే ముందే రాష్ట్రంలో ఓ ప్రభుత్వ ఆస్పత్రిని ఖాళీ చేయించి 500 - 700 పడకలతో కరోనా కేసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అవసరమన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌, తదితర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కరోనాతో కర్ణాటకలోని కలబురిగిలో నిన్న రాత్రి మృతిచెందిన 75 ఏళ్ల వృద్ధుడితో పాటు ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని