భారతీయుల కోసం ఇటలీకి వైద్య బృందం

ఇటలీలో చిక్కుకున్న భారతీయులకు కరోనా వైరస్‌ (కొవిడ్-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఓ భారతీయ వైద్య బృందం శుక్రవారం లియోనార్డొ డావిన్సీ అంతర్జాతీయ విమానాశ్రయానికి....

Published : 14 Mar 2020 00:51 IST

దిల్లీ: ఇటలీలో చిక్కుకున్న భారతీయులకు కరోనా వైరస్‌ (కొవిడ్-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఓ భారతీయ వైద్య బృందం శుక్రవారం లియోనార్డొ డావిన్సీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.  కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉన్న ఇటలీలో ఇంచుమించు 1.6 లక్షల మంది భారతీయులు వృత్తి రీత్యా అక్కడ నివసిస్తున్నారు. మరో 3,800 మంది భారతీయ విద్యార్థులు అక్కడి వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న విద్యార్థులతో సహా పలువురు భారతీయులకు కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని భారత రాయబార కార్యాలయం ఇటలీ అధికారులను అభ్యర్థించింది. కానీ ఇప్పటికే ఆ దేశంలో వైద్యపరమైన అత్యయిక పరిస్థితి ఉన్న నేపథ్యంలో... ఒత్తిడిలో ఉన్న ఆ దేశ వైద్యశాఖ ఇందుకు సరైన విధంగా స్పందించలేకపోయింది.

ఇందుకు ప్రత్యామ్నాయంగా భారత ప్రభుత్వం ఓ వైద్య బృందాన్ని ఇటలీకి పంపింది. ఈ వైద్య బృందం రానున్న రెండు రోజుల్లో అక్కడి భారతీయులకు కొవిడ్‌-19 పరీక్షలను నిర్వహిస్తుంది. పరీక్షల అనంతరం కరోనా లేనట్టు తేలిన భారతీయులు స్వదేశానికి తిరిగి రావచ్చని భారతీయ దౌత్య అధికారులు వివరించారు. భారత్ చేరుకున్న అనంతరం వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామని వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని