కరోనా: ఇంటికే పరిమితమైన ఇవాంక

కరోనా వైరస్‌ ధాటికి వివిధ దేశాల్లోని ప్రముఖ నేతలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో వైద్య పరీక్షలు చేయించుకోగా నెగెటివ్‌గా తేలింది..........

Published : 14 Mar 2020 21:21 IST

ఇదే బాటలో పలు దేశాల కీలక నేతలు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ ధాటికి వివిధ దేశాల్లోని ప్రముఖ నేతలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో వైద్య పరీక్షలు చేయించుకోగా.. నెగెటివ్‌గా తేలింది. మరోవైపు ఇరాన్‌లో పలువురు నేతలు, ఉన్నతాధికారులు వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన వ్యక్తులతో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కలిసినట్లు తేలడంతో ఆయనా పరీక్షలు చేయించుకోక తప్పదేమోనన్న చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్‌తో భేటీ అయిన ఆస్ట్రేలియా హోంమంత్రి పీటర్‌ డుటన్‌కూ కరోనా సోకింది. దీంతో ఇవాంక ఇంటికే పరిమితమయ్యారు. అధ్యక్షుడికి సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆమె శుక్రవారం ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. అయితే ఆమెలో వైరస్‌ లక్షణాలు ఏమాత్రం లేవని.. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన అవసరం లేదని ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌’(సీడీసీ) వైద్యులు సూచించారు. అయినా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఆమె ఇంట్లోనే ఉన్నారని శ్వేతసౌధం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

 

మరోవైపు కెనడా ప్రధాని భార్య సోఫీ గ్రెగొరీకి వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. దీంతో పిల్లలతో సహా దంపతులు క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని ఆరోగ్యంగానే ఉన్నానని ట్రూడో తెలిపారు. వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. సోఫీకి లక్షణాలు ప్రస్తుతం స్వల్ప స్థాయిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతికత వల్ల ఇంటి నుంచే పనిచేసుకోవడం సాధ్యమవుతోందన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

అలాగే బ్రెజిల్‌, ఫిలిప్పీన్స్‌లోని అనేక మంది నేతల కరోనా వైద్య పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది. ఇరాన్‌  సలహాదారు అయిన అలీ అక్బర్‌, ఆ దేశ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, క్యాబినెట్‌ మంత్రులకూ ఈ వైరస్‌ సోకిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని