ట్రంప్‌ కరోనా పరీక్షల్లో ఏం తేలింది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కరోనా వైరస్‌ ఉందా..?లేదా..?అన్న అనుమానం వీడింది. శుక్రవారం రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్లు శ్వేతసౌధం వైద్య వర్గాలు వెల్లడించాయి........

Published : 15 Mar 2020 08:40 IST

ఫలితాలు వెల్లడించిన శ్వేతసౌధం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కరోనా వైరస్‌ ఉందా..?లేదా..?అన్న అనుమానం వీడింది. శుక్రవారం రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చినట్లు శ్వేతసౌధం వైద్య వర్గాలు వెల్లడించాయి. 24 గంటల్లోపే ఫలితాలు రావడం విశేషం. ట్రంప్‌ ఇటీవల బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో సహా ఆయన కమ్యూనికేషన్‌ చీఫ్‌ ఫాబియోతో భేటీ అయ్యారు. అయితే తాజాగా ఫాబియోకు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ట్రంప్‌నకు వైరస్‌ సోకిందా..లేదా..అన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని తేలింది. భేటీ జరిగి వారం గడుస్తున్నా ట్రంప్‌లో ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని ఆయన వ్యక్తిగత వైద్యుడు తెలిపారు. మరోవైపు బోల్సోనారోకు జరిపిన పరీక్షల్లోనూ నెగెటివ్‌ రావడం గమనార్హం.

అందుకే పరీక్షలు...
అయితే, బోల్సోనారో-ట్రంప్‌ మధ్య జరిగిన భేటీలో పాల్గొన్న అధికారుల్లో ఇప్పటి వరకు ఆరుగురికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. దీంతో ఈ విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి 7న ఫ్లోరిడాలోని ఓ రిసార్టులో వీరంతా కలిసి భోజనం చేశారు. అక్కడే ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్‌ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోల్సోనారో, ట్రంప్‌ సైతం పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చింది. మరికొంత మంది ఇంకా పరీక్ష ఫలితాల కోసం వేచిచూస్తున్నారు.

స్పెయిన్‌ ప్రధాని భార్యకు కరోనా..

అగ్రనేతలను సైతం వదలని కరోనా వైరస్‌ తాజాగా స్పెయిన్‌ ప్రధాని భార్యకు సోకింది. ఈ విషయం ప్రధాని పెడ్రో శాంచెజ్‌ కార్యాలయం శనివారం వెల్లడించింది. ఆ దేశంలో వైరస్‌ తీవ్రత ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని ప్రకటిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో దంపతులిద్దరూ వైద్యుల సూచనల మేరకు ఇంటికే పరిమితమయ్యారు. రెండు రోజుల క్రితం కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీకి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని