
JKకు త్వరలోనే రాష్ట్ర హోదా: అమిత్ షా
దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకులను విడుదల చేస్తామన్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన అప్నీ పార్టీ అధినేత అల్తఫ్ బుకారీ నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధులు ఆదివారం అమిత్‌షాను కలిశారు. శనివారం వారు ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో మారబోయే పరిస్థితులను త్వరలో మనమే కళ్లతో చూడబోతున్నామని అమిత్ షా వారితో అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందన్నారు. డెమోగ్రఫిక్ మార్పులకు సంబంధించి వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలతో కలిసి పనిచేసి వీలైనంత తొందర్లో జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ, లోక్‌సభలో ఆగస్టు 6న తాను సైతం ఇదే విషయాన్ని చెప్పామని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్ ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఆంక్షలు ఎత్తివేస్తామని తెలిపారు. త్వరలోనే నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలను సైతం విడుదల చేస్తామన్నారు. ఏ ఒక్కరూ మరణించకూడదన్నదే తమ ఉద్దేశమమని పేర్కొన్నారు. గత 70 ఏళ్లలో రాని పెట్టుబడులు రాబోయే నాలుగేళ్లలో సమకూరనున్నాయని చెప్పారు. నిరుద్యోగ సమస్యను కూడా తొలగిస్తామని హామీ ఇచ్చారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.