భారత్‌లో కరోనా బాధితుడి అనుభవమిది..!

ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఉప్పెన లాంటి కరోనా బారినపడి, క్షేమంగా బయట పడటం నమ్మశక్యం కానిదంటున్న ఆయన స్వానుభవం...

Updated : 16 Mar 2020 12:27 IST

 కరోనా నయమైన తొలి భారతీయుడి అనుభవం

దిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) సోకినప్పటికీ ఏమాత్రం భయపడనవసరం లేదని ఈ వ్యాధి వచ్చి తగ్గిన 45 సంవత్సరాల భారతీయ వ్యాపారవేత్త చెబుతున్నారు. దిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రిలో ఆయన రెండు వారాల పాటు కరోనాకు చికిత్స పొందారు. ఈ వ్యాధి లక్షణాలున్న వారు నిర్భయంగా ముందుకు వచ్చి తాము తిరిగిన ప్రదేశాల వివరాలను, ఆరోగ్య లక్షణాలను అధికారులకు చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ విధంగా చేయకపోతే.. తమ ప్రాణాలనే కాకుండా ఆత్మీయుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేసినట్లవుతుందని హెచ్చరించారు. కరోనా బారినపడి, క్షేమంగా బయటపడిన ఆయన.. తన స్వానుభవాన్ని వివరించారు.

అప్పటికి ఏ వార్తలు వెలువడలేదు

‘నేను బూట్లలో విడి భాగాలను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాను. ఓ లెదర్‌ ఎగ్జిబిషన్‌లో పాల్గొనేందుకు నేను ఫిబ్రవరిలో ఇటలీకి వెళ్లాను. నాటికి కరోనా గురించి ఏ వార్తలు వెలువడలేదు. ఫిబ్రవరి 25న నేను యూరోప్‌ నుంచి దిల్లీకి వచ్చాను. మరుసటి రోజే నాకు జ్వరం మొదలైంది. వైద్యుని సంప్రదించగా, గొంతులో ఇన్ఫెక్షన్‌ వల్ల అలా వచ్చిందని.. మూడు రోజులకు సరిపడా మందులు ఇచ్చారు. దానితో ఫిబ్రవరి 28న జ్వరం తగ్గింది. కానీ మర్నాడే మళ్లీ జ్వరం మొదలయింది. కుటుంబ సభ్యుల సలహాతో నేను రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి వెళ్లాను’  

భయపడ్డాను, కానీ...

‘అక్కడ నాకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మార్చి 1న వెలువడి ఆ ఫలితాల్లో నాకు ‘కొవిడ్‌-19’ పాజిటివ్‌గా తేలింది. అరగంటలో నన్ను సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలోని రెండతస్తుల ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. నిజానికి నేను మొదట చాలా భయపడ్డాను. మరుసటి రోజు వైద్యుల బృందం నా వద్దకు వచ్చింది. కరోనావైరస్‌ నాకు తొలిదశలోనే ఉందని.. ఇది నయం అవుతుందని చెప్పి మనోధైర్యాన్నిచ్చారు. నాకు వచ్చింది కేవలం సాధారణ జలుబు, దగ్గు మాదిరి సమస్యేనని.. ఇతర అనారోగ్యాలేమీ లేకపోవడంతో ఈ వ్యాధి తగ్గిపోతుందన్నారు. కాకుంటే కాస్త ఆలస్యమవుతుందని వారు వివరించారు. సాధారణ జలుబు, దగ్గు కంటే కరోనా కాస్త భిన్నంగా ఉందని నాకు అనిపించింది’

ఐసోలేషన్ వార్డులో... 

‘ఐసొలేషన్‌ అంటే జైలు గది కాదు. ఇక్కడ ఏర్పాట్లు నమ్మశక్యం కానంత సౌకర్యవంతంగా ఉంటాయి. ఇక్కడి శుభ్రత, వైద్య ప్రమాణాలు స్థాయి అత్యుత్తమ ప్రైవేటు ఆస్పత్రుల కన్నా చాలా బాగుంటుంది. ఐసొలేషన్‌ వార్డులో నాకు బాత్ రూంతో కూడిన ఓ ప్రత్యేక గదిని కేటాయించారు. నా గదిలో రోజుకు రెండు సార్లు మొత్తం పరిసరాలను శుభ్రం చేసి, ఆ గదిలోని దుప్పట్లు, కర్టెన్లు, దిండ్లు తదితరాలు మార్చేవారు’

ఒంటరిని కాలేదు

‘ఐసొలేషన్లో ఉన్నపుడు నాకు ఫోన్‌ అందుబాటులో ఉంది. నిత్యం వీడియోకాల్‌ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడాను. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూశాను. రోజుకు రెండు సార్లు ప్రాణాయామం చేశాను. రెండుసార్లు ‘చాణక్యనీతి’ పుస్తకాన్ని చదివేవాడిని. ఇన్నాళ్లు ఆస్పత్రిలో ఉన్నా... ఎప్పుడూ ఒంటరిగా అనిపించలేదు. ఐసొలేషన్‌ వార్డు సిబ్బంది అద్భుతమైన సేవలు అందించారు. ప్రాణాలను కూడా పణంగా పెట్టి విధులు నిర్వహించిన నర్సులు, శుభ్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాను’

హోలీ నాడు ఆయన ఫోన్‌ చేశారు...
‘కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ హోలీ సందర్భంగా నాతో మాట్లాడారు. నాలాంటి సాధారణ వ్యక్తికి ఆయన ఫోన్‌ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆహారం, సదుపాయాలను, వైద్యాన్ని గురించి ఆయన అడిగారు. ప్రధానితో సహా తాను వ్యక్తిగతంగా కొవిడ్‌-19 పేషెంట్ల స్థితిగతులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు’ అని ఆ బాధితుడు ఆంగ్లమీడియాకు వెళ్లడించారు. 

ఆగ్రాలోఉండే సదరు బాధితుడి కుటుంబంలోని నలుగురికి కూడా కరోనా సంక్రమించింది. కాగా, వారందరూ సఫ్దర్ జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ ఆదివారం డిశ్చార్జ్‌ ఆయ్యారు. ఐసొలేషన్‌ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులను మరో 14 రోజుల పాటు ఇంటికే పరిమితమవ్వాల్సిందిగా వైద్య నిపుణులు సూచించారు. తనకు చికిత్స చేసిన వైద్యులు చాలా ఆత్మీయంగా అంకిత భావంతో సేవలందిచినట్లు ఈ వ్యాపారవేత్త వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని