ఆర్థిక మాంద్యంలోకి జారుకోవచ్చు: ట్రంప్‌

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రానున్న 15 రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని స్వయంగా అధ్యక్షుడు ట్రంపే వివరించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.......

Updated : 09 Dec 2023 16:59 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రానున్న 15 రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని స్వయంగా అధ్యక్షుడు ట్రంపే వివరించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. 10 కంటే ఎక్కువ  మంది హాజరయ్యే అవకాశం ఉన్న అన్ని సమావేశాల్ని రద్దు చేసుకోవాలని ఆదేశించారు. పరిస్థితి చాలా దయనీయంగా ఉందని శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇప్పటి వరకు అమెరికాలో 4500 మందికి పైగా వైరస్‌ బారినపడగా.. వీరిలో 88 మంది మృత్యువాతపడ్డారు. వచ్చే జులై లేదా ఆగస్టులోగా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రావొచ్చని అభిప్రాయపడ్డారు. అంతకంటే ఎక్కువ రోజులు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. రెస్టారెంట్లు, బార్లు, వ్యాయామశాలలకు వెళ్లొద్దని సూచించారు. వృద్ధులు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు. అందరు కలిసి కట్టుగా పనిచేస్తేనే వైరస్‌ ముప్పును ఎదుర్కోగలమని పిలుపునిచ్చారు. 

ఇక ఆర్థిక పరిస్థితిపైనా ట్రంప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్‌ వల్ల ఎదురవుతున్న సవాళ్లతో అమెరికా ఆర్థిక వ్యవస్థ త్వరలో మాంద్యంలోకి జారుకోవచ్చని అంచనావేశారు. అయితే తిరిగి వెంటనే కోలుకుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తాము మార్కెట్ల గురించి ఆలోచించడం లేదని.. వైరస్‌ను ఎలా కట్టడి చేయాలన్నదానిపైనే దృష్టి సారించామని తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి విమానయాన సంస్థలు తీవ్ర గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. దీనిపై స్పందించిన ట్రంప్‌.. ఆ రంగానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించే ఆలోచన ప్రస్తుతానికి లేదన్నారు. అమెరికాలో గత వందేళ్లలో మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు వాదనల్ని వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని