24 గంటల్లో 14వేల కరోనా కేసులు..!

ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. దీంతో ఇప్పటి మొత్తం ప్రపంచదేశాల్లో 1,67,500 దాటినట్లు మంగళవారం పేర్కొంది......

Updated : 17 Mar 2020 14:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం ప్రపంచదేశాల్లో బాధితుల సంఖ్య 1,67,500 దాటినట్లు మంగళవారం పేర్కొంది. ఆయా దేశాల అధికారిక గణాంకాల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉన్నట్లు వివిధ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఐరాస భద్రతా మండలికి సంబంధించిన అన్ని రకాల సమావేశాల్ని వాయిదా వేస్తున్నట్లు యూఎన్‌ఎస్సీ ప్రకటింటింది. ఇప్పటికే తమ ఉద్యోగులు ఇంటి నుంచి సేవలందించాలని కోరిన విషయం తెలిసిందే. 

పరీక్షలే మార్గం..
చైనాను వీడి ఐరోపాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌.. ఆ దేశాల్ని పూర్తిగా నిర్బంధంలోకి నెట్టింది. ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌ఓ ప్రతి అనుమానిత వ్యక్తికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరింది. వైరస్‌ను కట్టడి చేయాలంటే ఇంతకు మించిన మార్గం లేదని సంస్థ చీఫ్‌ టెడ్రోస్ అధానోమ్‌ అభిప్రాయపడ్డారు. ఆంక్షలు, నిషేధాల పేరిట పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు.

విదేశీయులపైనే చైనా ఆందోళన..
తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో వైరస్‌ భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. సోమవారం దేశీయంగా కేవలం ఒక్కకేసే నమోదు కాగా.. ఇతర దేశాల నుంచి వచ్చిన మరో 20 మందికి వైరస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో కొత్తగా 21 కేసులు నమోదయ్యాయి. అయితే రోజుకు సగటున 20 వేల మంది చైనాలోకి ప్రవేశిస్తుండడం ఇప్పుడు ఆ దేశానికి ఆందోళన కలిగిస్తోంది. ఇక సోమవారం మరో 13 మంది మృతిచెందడంతో మృతుల సంఖ్య 3,226కు చేరింది.

మరో 15 రోజులు బయటకు రావొద్దు..
కరోనా వైరస్‌ వల్ల సోమవారం కొత్తగా మరో 21 మంది మృతిచెందడంతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించిన అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. నిబంధనల్ని ఉల్లఘించినవారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. రానున్న 15 రోజుల పాటు కఠిన ఆంక్షలు తప్పవని స్పష్టం చేశారు. ఐరోపా సమాఖ్య దేశాల సరిహద్దుల్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 148 మంది మృతిచెందగా.. 1,210 మంది వైరస్‌ సోకి బాధపడుతున్నారు. 

నాలుగు రోజుల్లో రెండింతలైన మరణాలు..
ఇటలీ పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే 349 మరణాలు సంభవించాయి. దీంతో అక్కడ కరోనా మృతుల సంఖ్య 2,158కి చేరింది. గత నాలుగు రోజుల్లో మృతుల సంఖ్య రెండింతలు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత రెండు రోజుల్లోనే 700 మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇప్పటికే ప్రజారవాణాపై భారీ ఆంక్షలు విధించిన అక్కడి ప్రభుత్వం సోమవారం బీచ్‌లకు కూడా ఆ నిబంధనల్ని విస్తరించింది.

పాకిస్థాన్‌లో ఒక్కరోజే 100 కేసులు..

దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ వైరస్‌ తన ప్రతాపాన్ని ఉద్ధృతం చేసింది. సోమవారం ఒక్కరోజే దాదాపు 100కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 183కు చేరింది. ఒక్క సింధ్‌ ప్రావిన్సులోనే 150 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో చాలా మంది దర్శనీయ స్థలాలకు వెళ్లొచ్చిన వారేనని అక్కడి అధికారులు తెలిపారు. తొలుత వీరిని బలూచిస్థాన్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. కానీ, అక్కడి ప్రభుత్వం చేతులెత్తేయడంతో వారందరినీ సొంత ప్రావిన్సులకు తరలించారు. దీంతో వైరస్‌ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగింది. 

ఇరాన్‌ ప్రభుత్వంలో ఉన్నతాధికారి మృతి..
కరోనా ప్రభావం అత్యధిక స్థాయిలో ఉన్న ఇరాన్‌లోనూ పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు సోమవారం ఒక్కరోజే 129 మంది మృతిచెందారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 853కు చేరింది. మరో 15,000 మంది వైరస్‌ బారిన పడ్డారు. సోమవారం ఓ ఉన్నతాధికారి మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు ఇరాన్‌లో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు  కలిపి 12 మంది మరణించారు. మరో 13 మంది క్వారంటైన్‌లో ఉన్నారు.

7.3 బిలియన్‌ డాలర్లతో న్యూజిలాండ్‌ ప్యాకేజీ
వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో స్తంభించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా న్యూజిలాండ్‌ 7.3 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు విలువ చేసే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. మేలో జరగబోయే బడ్జెట్‌ సమావేశాల్లో మరిన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ దేశంలో ఎనిమిది మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు.

* చిలీ, పెరూ, ఉక్రెయిన్, రష్యా విదేశీయుల రాకపై పూర్తిగా నిషేధం విధించాయి. ఆ దేశాల్లో అంతర్గత రవాణాపైనా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. రష్యాలో ఇప్పటి వరకు 93 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి.

దేశం     బాధితులు        మృతులు
చైనా  80,881   3,226
ఇటలీ   27,980  2,158
ఇరాన్‌   14,991  853
స్పెయిన్‌   9,942  342
ఫ్రాన్స్‌  6,663  148
అమెరికా  4,283  88
దక్షిణ కొరియా  8,320   81
జర్మనీ  6,012   14
యూకే  1,543 55
జపాన్‌  814  24
భారత్‌  125 03
ప్రపంచవ్యాప్తంగా   1,79,238   7,138

ప్రపంచవ్యాప్తంగా కోలుకున్నవారు: 79,611


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని