అప్పుడు నేను దిల్లీలోనే లేను: నిర్భయ దోషి

ఉరి అమలు తేదీ దగ్గరపడుతుండడంతో నిర్భయ దోషులు శిక్ష తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ తాజాగా దిల్లీ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశాడు..........

Updated : 17 Mar 2020 14:35 IST

దిల్లీ: ఉరి అమలు తేదీ దగ్గరపడుతుండడంతో నిర్భయ దోషులు శిక్ష తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ తాజాగా దిల్లీ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశాడు. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబరు 16న తాను దిల్లీలోనే లేనని పిటిషన్‌లో చెప్పుకొచ్చాడు. డిసెంబర్‌ 17, 2012న రాజస్థాన్‌ నుంచి పోలీసులు తనని దిల్లీ తీసుకొచ్చారని పేర్కొన్నాడు. తిహాడ్‌ జైలులో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తనకు మరణశిక్ష రద్దు చేయాలని కోరాడు. ఈ మేరకు దిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు అడిషనల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ముందు తన పిటిషన్‌ని ఉంచాడు. ఈ నెల 20న ఉదయం 5:30గంటలకు ఉరితీయాలని మార్చి 5న ట్రయల్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరణశిక్ష అమలు వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు అక్షయ్‌ ఠాకూర్‌ (31), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), ముకేశ్‌సింగ్‌ (32) శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. న్యాయపరమైన అవకాశాల పేరిట వారు పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరి అమలు తేదీ మూడుసార్లు వాయిదా పడింది. తొలిసారి ఈ ఏడాది జనవరి 22న, ఫిబ్రవరి 1న రెండోసారి, మార్చి 2న మూడో సారి డెత్‌ వారెంట్లు జారీ అయినప్పటికీ ఉరి వాయిదా పడింది. చివరకు ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తలుపులు కూడా తట్టారు. తమకు ఉరిశిక్ష విధింపు చట్టవిరుద్ధమని, నిలిపివేయాలని ఐసీజేను కోరారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ ఈ మేరకు ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు తనకున్న చట్టపరమైన పరిష్కార మార్గాలన్నిటినీ పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ ముకేశ్‌ సింగ్‌ దాఖలు చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని