కౌలాలంపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

ఫిలిప్ఫిన్స్‌లో చదువుకుంటున్న 300 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కౌలాలంపుర్‌లో నిలిచిపోయారు.  కరోనా ప్రభావంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో...

Updated : 17 Mar 2020 17:54 IST

కౌలాలంపూర్‌: చైనాలో ఉనికిలోకి వచ్చిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్‌ బారినపడి ప్రపంచవ్యాప్తంగా 7 వేలకుపైగా మరణించగా.. మొత్తం కరోనా సోకిన బాధితుల సంఖ్య 1,67,500 దాటినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో వివిధ దేశాల్లోని విద్యాసంస్థలు సెలవులు ప్రకటించడంతో అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు స్వస్థలాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లో చదువుకుంటున్న సుమారు 300 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు.. స్వస్థలాలకు వస్తూ మలేసియా రాజధాని కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో నిలిచిపోయారు. అక్కడి విమానాశ్రయంలోకి రావడానికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత రాయబార కార్యాలయం అనుమతి లేనిదే విమానం ఎక్కేందుకు అనుమతించేది లేదని విమానాశ్రయ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై స్వదేశంలోని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు విమానాశ్రయంలో చిక్కుకుపోయిన విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 300 మంది ఇక్కడ నిలిచిపోయినప్పటికీ తమను ఎవరూ పట్టించుకోవడం లేదని.. తిరిగి ఫిలిప్పీన్స్‌ వెళ్లిపోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారు 72 గంటల్లోగా ఫిలిప్పీన్స్‌ వదిలి వెళ్లాలని అక్కడి ప్రభుత్వం సూచించిందని.. ఇప్పుడు భారత్‌కు రాకుండా తిరిగి అక్కడికే వెళ్లిపోవాలని భారత్‌కు చెందిన కొంత మంది అధికారులు చెబుతున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు. కొన్ని గంటలుగా తినేందుకు ఆహారం, వైద్య సేవలు అందుబాటులో లేవని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని