అలా చేస్తే పాక్‌లో ఆకలి చావులే: ఇమ్రాన్‌ఖాన్‌

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి చాలా దేశాలు నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రజా రవాణా సహా సాధారణ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాల్సిన ఆవశ్యతకత ఏర్పడింది........

Published : 18 Mar 2020 11:08 IST

ఇస్లామాబాద్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి చాలా దేశాలు నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రజా రవాణా సహా సాధారణ కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాల్సిన ఆవశ్యతకత ఏర్పడింది. దీని వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. కానీ, మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవాలంటే తప్పని పరిస్థితి. ఈ తరుణంలో పాకిస్థాన్‌ పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దేశం ఇప్పుడు ఏకంగా దేశాన్నే నిర్బంధంలో ఉంచాల్సిన పరిస్థితిని భరించలేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖానే అంగీకరించారు. పశ్చిమ దేశాల్లో అనుసరిస్తున్న విధానాల్ని తాము అవలంబించలేమని తేల్చి చెప్పారు. ప్రముఖ నగరాల్ని పూర్తిగా నిర్బంధించాలన్న ప్రతిపాదనకు తమ అధికారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దీని వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రజలపై కరోనా పేరిట కఠిన ఆంక్షలు విధిస్తే ఆకలితో మరణించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు. ఇప్పటికే విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాలు మూసివేశామని గుర్తుచేశారు.

ఇప్పటికే తీవ్ర ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సాయంపైనే నెట్టుకొస్తోంది. పైపెచ్చు కరోనా వైరస్‌ ముప్పు పొంచి ఉన్న దేశాల్లో పాకిస్థాన్‌ ఒకటి. ఆ దేశంలో 200 మందికిపైగా ఈ వైరస్‌ సోకింది. మరో 1,571 మంది అనుమానితులు వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. కరాచీ వంటి అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో వైరస్‌ వ్యాప్తి భయానక అనుభవాల్నే మిగిల్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ఐరోపా దేశాల తరహాలో కఠిన ఆంక్షలు అమలు చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్‌ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందే చూడాలి మరి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని