కరోనా ఎఫెక్ట్‌: ఐఐటీ బాంబే మూసివేత!

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా అక్కడి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు విద్యాసంస్థలు మూతపడగా తాజాగా ఐఐటీ బాంబే తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. మార్చి 31వరకు క్యాంపస్‌ను మూసివేస్తున్నామని..విద్యార్థులు కూడా రెండురోజుల్లో హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశించింది.

Updated : 18 Mar 2020 19:12 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కారణంగా అక్కడి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు విద్యాసంస్థలు మూతపడగా తాజాగా ఐఐటీ బాంబేను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. మార్చి 31 వరకు క్యాంపస్‌ను మూసివేస్తున్నామని, విద్యార్థులు కూడా రెండురోజుల్లో హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశించింది. క్యాంపస్‌లోకి ఏ ఒక్కరినీ అనుమతించబోమని, కొందరు విదేశీ విద్యార్థులకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. కరోనాను ఎదుర్కోవడంలో రాష్ట్రప్రభుత్వం,  గ్రేటర్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. క్యాంపస్‌లో మొత్తం 11వేల మంది విద్యార్థులు ఉండగా ఇప్పటికే కొందరు విద్యార్థులు వివిధ కారణాలతో వారి ఇళ్లకు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. 

గోవాలో తొలికేసు నమోదు.. 
ఇప్పటికే దేశంలో 16 రాష్ట్రాలకు వ్యాపించిన కరోనా వైరస్‌ తాజాగా గోవాకు చేరింది. నార్వేకు చెందిన ఓ వ్యక్తి ఫిబ్రవరి 6న గోవా చేరుకోగా మార్చి 10న అతడిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా తాజాగా అతడికి కరోనా నిర్థారణ అయినట్లు గోవా ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్‌ రాణే వెల్లడించారు. 

రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..

కరోనా వైరస్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. పాఠశాలలు మూతపడడంతో బడి పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు తెలపాలని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని బెంచ్‌ ఈ కేసును విచారణను సుమోటోగా స్వీకరించింది. 

నెలపాటు నిరసనలు బంద్‌: భాజపా
దేశంలో కొవిడ్‌-19 విజృంభిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే గుంపులుగా ఉండకూడదని కేంద్రప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా తమ పార్టీ తరపున ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు సూచించింది. అంతేకాకుండా కరోనాపై అవగాహన చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు సూచించింది.

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని