చికిత్స అందించిన వైద్యుడికీ కరోనా

యూపీలోని కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆస్పత్రిలో ఇద్దరు కరోనా బాధితులకు చికిత్స అందించిన ఆయనలో కరోనా పాజిటివ్‌....

Published : 18 Mar 2020 20:10 IST

లఖ్‌నవూ: యూపీలోని లఖ్‌నవూ కింగ్‌ జార్జ్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆస్పత్రిలో ఇద్దరు కరోనా బాధితులకు చికిత్స అందించిన వైద్యుడికి కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు అస్పత్రి అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

కెనడా నుంచి వచ్చిన ఓ మహిళ, ఆమెతో సన్నిహితంగా మెలిగిన ఆమె బంధువుకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. వారికి కేజీఎంయూ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. 25 ఏళ్ల జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ వారి శాంపిల్స్‌ తీసుకున్నారు. దీంతో అతడిలోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. పరీక్షించగా కరోనా పాజిటివ్‌ అని తేలిందని కేజీఎంయూ అధికార ప్రతినిధి డాక్టర్‌ సుధీర్‌సింగ్‌ తెలిపారు. అతడితో పాటు ఐసోలేషన్‌ వార్డులో పనిచేసిన 14 మందినీ పరీక్షించగా వారిలో కరోనా నెగిటివ్‌ అని తేలిందన్నారు. ప్రస్తుతం వైద్యుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కోసం వచ్చిన ఇద్దరు బాధితులు సైతం కోలుకుంటున్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని