ఆ స్టాంపుతో రైలు ప్రయాణం..దించివేత!

ప్రస్తుతం దేశంలో ఎక్కడచూసినా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు విస్తరించిన కరోనా వైరస్‌తో ప్రజలు తమ దూర ప్రయాణాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. విదేశీ ప్రయాణం చేసివచ్చిన వారిని కొన్నిరోజుల పాటు ఇంటికే పరిమితం.......

Published : 18 Mar 2020 18:51 IST

ముంబయి: ప్రస్తుతం దేశంలో ఎక్కడచూసినా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు విస్తరించిన కరోనా వైరస్‌తో ప్రజలు తమ దూర ప్రయాణాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. విదేశీ ప్రయాణం చేసివచ్చిన వారిని కొన్నిరోజుల పాటు ఇంటికే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంత అప్రమత్తంగా ఉన్న సమయంలో ‘హోం క్వారంటైన్‌’ కావాల్సిన కొందరు వ్యక్తులు రైల్లో ప్రయాణం చేయడం కలకలంరేపింది. ఇది గమనించిన సిబ్బంది వారిని అక్కడే రైలు నుంచి దించేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. 

ఇటీవల జర్మనీ నుంచి ముంబయి వచ్చిన నలుగురు వ్యక్తులకు విమానాశ్రయంలోనే కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. స్క్రీనింగ్‌లో వారికి కరోనా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారి చేతులకు ‘హోం క్వారంటైన్‌’ స్టాంపు వేసి.. 14 రోజుల పాటు నిర్బంధంలోనే ఉండాలని సూచించారు. కానీ, అధికారుల సూచనలను పట్టించుకోని సదరు వ్యక్తులు గరీభ్‌రథ్ రైల్లో ముంబయి నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు బయలుదేరారు. కొంతదూరం ప్రయాణించిన అనంతరం వారిచేతులకు ఉన్న స్టాంపులను గమనించిన ఆ బోగీలోని సహ ప్రయాణికులు వెంటనే చైన్‌ లాగి రైలుని నిలిపివేశారు. వివరాలు తెలుసుకున్న రైలు సిబ్బంది వారిని పాల్ఘర్‌ స్టేషన్లో దించివేశారు. అనంతరం వారిని జిల్లా అధికారులకు అప్పగించి సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు.. వారిని రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని