
సుప్రీంకోర్టుకు నిర్భయ దోషి!
దిల్లీ: ఉరిశిక్ష ఘడియలు దగ్గరపడుతుండడంతో నిర్భయ దోషులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవు. ఉరి అమలు సమయానికి కేవలం కొద్దిగంటలే మిగిలిఉండడంతో న్యాయస్థానాల్లో వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్ సింగ్ అత్యాచార ఘటన జరిగిన సమయంలో తాను దిల్లీలోనే లేనని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన జరిగిన డిసెంబరు 16వ తేదీన తాను దిల్లీలో లేనని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తనకు మరణశిక్ష రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరాడు. దీనిని నేడు మధ్యాహ్నం 2.30కు న్యాయస్థానం విచారించనుంది. ఇదే విషయమై అతను బుధవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇప్పటికే ఈ కేసులో మరో దోషిగా ఉన్న పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు ఉదయం ఆ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. తమపై కేసులు న్యాయ స్థానాల్లో పెండింగ్‌లో ఉండటంతో డెత్‌వారెంట్‌ను నిలిపివేయాలని నలుగురు దోషులు తాజాగా దిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆదేశాలను న్యాయస్థానం రిజర్వులోపెట్టింది.
మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు అక్షయ్ ఠాకూర్(31), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), ముకేశ్ సింగ్(32) న్యాయపరమైన అవకాశాల పేరిట పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. రేపు ఉదయం 5.30గంటకు వీరిని ఉరితీసేందుకు జైలు అధికారులు సిద్ధం అయ్యారు. దీనిపై మార్చి 5న ట్రయల్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.