కరోనా రోబోలు    

రోబోలతో కొవిడ్‌-19పై అవగాహన కల్పించటంతో పాటు, ప్రజలకు స్వయంగా మాస్కుల అందిస్తోంది.

Published : 19 Mar 2020 23:59 IST

కేరళ స్టార్టప్‌ మిషన్‌ వినూత్న ప్రయత్నం     

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా ప్రజలలో తీవ్రభయాందోళనలు సృష్టిస్తున్న వేళ కేరళ ప్రభుత్వ అనుబంధ సంస్థ వినూత్న ప్రయత్నం చేస్తోంది. రోబోలతో కొవిడ్‌-19పై అవగాహన కల్పించటంతో పాటు, ప్రజలకు స్వయంగా మాస్కులను అందిస్తోంది. హ్యూమనాయిడ్‌ రోబోలతో కరోనా వ్యాపించిన వారికి వైద్య సహాయం కూడా చేయవచ్చని చెబుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ అనేక దేశాలలో మరణ మృందంగం మోగిస్తుండగా, వేల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి అనేక దేశాలు యుద్ధ ప్రాతిపదికన అనేక చర్యలు చేపడుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వారికి వైద్యం అందిస్తున్న వైద్యులకు సైతం వ్యాధి అంటుకుని వారు కూడా మృతి చెందిన ఘటనలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో వైద్యులకు, సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా కేరళ ప్రభుత్వ అనుబంధ సంస్థ రోబోల అంశం తెరపైకి తీసుకొచ్చింది.  వైద్యం అందించటం కోసం హ్యూమనాయిడ్‌ రోబోలను రంగంలోకి దించింది. రెండు రోబోలను అభివృద్ధి చేసిన ఈ కేరళ స్టార్టప్‌ మిషన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని విషయాలను వాటిలో పొందుపరిచింది. ఈ రోబోలు వైరస్‌కు సంబంధించిన అన్ని రకాల విషయాలు ప్రజలకు వివరిస్తున్నాయి. శానిటైజర్‌లు, మాస్కులు, తదితరాలను స్వయంగా అందిస్తున్నాయి. కరోనా వైరస్‌ గురించి కచ్చితమైన సమాచారాన్ని ఈ రోబోల ద్వారా ప్రజలకు చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అసిమో రోబోటిక్స్‌ సీఈవో జయకృష్ణన్‌ వివరించారు. గతంలో  కేరళలో నిఫా వైరస్‌ ప్రబలిన తర్వాత ఈ  రోబోలను అభివృద్ధి చేశామన్నారు. భయానక వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నపుడు బాధితుల వద్దకు వెళ్లడానికి వైద్యులు సిబ్బంది భయపడుతుంటారని, వారికీ వ్యాధి సోకే అవకాశం ఉంటుందని, ఈ ముప్పును బాగా తగ్గించడానికే వీటిని తయారు చేశామని ఆయన వివరించారు. వీటిలో ఒక రోబో శానిటైజర్‌లు, తదితరాలను అందిస్తుండగా, మరో రోబో  వైరస్‌ గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తుందని ఆయన చెప్పారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని