సుప్రీంలో నిర్భయ దోషుల పిటిషన్‌ కొట్టివేత 

ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి సర్వోన్నత న్యాయస్థానంలోనూ వారికి చుక్కెదురైంది. ఉరిశిక్షను యథాతథంగా అమలు చేయాలన్న దిల్లీహైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ...

Updated : 20 Mar 2020 05:36 IST

ఉరి యథాతథం

దిల్లీ:ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి సర్వోన్నత న్యాయస్థానంలోనూ వారికి చుక్కెదురైంది. ఉరిశిక్షను యథాతథంగా అమలు చేయాలన్న దిల్లీహైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం దానిని కొట్టివేసింది.జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ బోపన్నల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీంతో ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయనున్నారు. నిర్భయ దోషులను కలిసేందుకు కుటుంబ సభ్యులకు 5-10 నిమిషాలు  అనుమతివ్వాలని వారి తరఫు న్యాయవాది ఎ.పి.సింగ్‌ కోరారు. దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ దీనికి జైలు నియమాలు అనుమతించవని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పుపట్ల నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్షతో నిర్భయ ఆత్మశాంతిస్తుందని అన్నారు.

తీహార్‌ జైలులో ఏర్పాట్లు పూర్తి

నిర్భయ దోషులను ఉరి తీయనున్న తిహార్‌ జైలులో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మంగళవారమే  తలారి పవన్‌ జల్లాద్‌ జైలుకు చేరుకున్నారు. బుధవారం అధికారుల సమక్షంలో డమ్మీ ఉరితీత ప్రక్రియ చేపట్టారు. ఉరి అమలు చేసే సమయంలో జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్‌, మెడికల్‌ ఇన్‌ఛార్జి ఆఫీసర్‌, రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌, జిల్లా మెజిస్ట్రేట్‌ సహా పలువురు పోలీసు అధికారులు అక్కడ ఉంటారు. ఈ ప్రక్రియ ముగిసేందుకు దాదాపు గంట సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. తిహార్‌ జైలులో చివరి సారిగా ఉగ్రవాది అఫ్జల్‌గురుని ఉరి తీశారు. అనంతరం ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ ఉరి తీయనున్నారు. ఒకేసారి నలుగురిని ఉరితీయడం తిహార్‌ జైలులో ఇదే తొలిసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని