Updated : 20 Mar 2020 14:05 IST

కరోనా మరణాల్లో చైనాను దాటేసిన ఇటలీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తోంది. రోజురోజుకి  బాధితుల సంఖ్య పెరగడంతోపాటు మరణించిన వారి సంఖ్య 200కు చేరింది. దీంతో ప్రజలను ఆదుకునేందుకు సెనేట్‌ రిపబ్లికన్లు 1 ట్రిలియన్‌ డాలర్లతో ఉద్దీపన చర్యలను ప్రకటించారు. ‘కరోనా వైరస్‌కు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని చైనా దాచడం మూలంగా ప్రపంచం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది’అని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా అమెరికా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

వీడియో కాన్ఫరెన్సులో జీ7 సదస్సు
కరోనా ప్రభావం కారణంగా జూన్‌లో జరగాల్సిన జీ7 దేశాల సదస్సును రద్దు చేస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. దీన్ని వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించనున్నట్లు వైట్‌హౌజ్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా ప్రభావంతో ప్రతి దేశం తమ ఆరోగ్య, ఆర్థిక సవాళ్లపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. మరోవైపు అమెరికాలో గంటల లెక్కన పనిచేసే వారికి (అవర్లీ వర్కర్స్‌) డిమాండు పెరిగింది. బిగ్‌బాక్స్‌ రిటైలర్‌ వాల్‌ మార్ట్‌ 1.5లక్షల మంది అవర్లీ వర్కర్స్‌ను నియమించుకునేందుకు సిద్ధమైంది. కాలిఫోర్నియాలో ప్రజలను ఇళ్ల వద్దే ఉండాలంటూ గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ ఆదేశించారు. ప్రజలను కేవలం నిత్యావసరాల కొనుగోలుకు మాత్రమే బయటకు అనుమతించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 56శాతం మంది ప్రజలు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

రూబీ ప్రిన్సెస్‌ ప్రయాణికులకు హెచ్చరికలు
ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు బహిరంగ సమావేశాలను నిషేధించారు. పాఠశాలలు, ప్రజా రవాణా వ్యవస్థను సైతం నిలుపుదల చేశారు. సిడ్నీలో ఉన్న రూబీ ప్రిన్సెస్‌ నౌకలో నుంచి దిగిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నౌకలో ఇప్పటికే ప్రయాణించిన వారిని వెంటనే స్వీయ నిర్బంధంలో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయాన్ని న్యూసౌత్‌వేల్స్‌ ఆరోగ్య మంత్రి బ్రాడ్ హజర్డ్ తెలిపారు. నౌకలో మొత్తం 2,700 మంది ప్రయాణించినట్లు సమాచారం.

చైనాను దాటిన ఇటలీ
ఇటలీపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా కొనసాగుతోంది. ఆ దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య చైనాను దాటిపోయింది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,400కు చేరింది. కాగా చైనాలో ఆ సంఖ్య 3,245 వద్ద ఉంది. మరోవైపు బుధవారం నాడు ఇటలీలో ఒక్క రోజులోనే అత్యధికంగా 475 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. గురువారం 427 మంది మరణించారు. ఇప్పటివరకు ఇటలీలో వైరస్‌ బాధితుల సంఖ్య 41,035కు చేరినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ప్రతి పది నిమిషాలకు ఒక ప్రాణం
కరోనా వైరస్‌ మహమ్మారి ప్రతి పది నిమిషాలకు ఒక ప్రాణాన్ని బలి తీసుకుంటోందని ఇరాన్‌ ఆరోగ్య శాఖ ప్రతినిధి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇరాన్‌లో కొవిడ్‌-19 మరణాల సంఖ్య 1,284కు చేరింది. మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 18,407కు చేరింది. కాగా ప్రపంచవ్యాప్తంగానూ కరోనా ప్రభావం కొనసాగుతోంది. 

చైనాలో విదేశీ కేసుల పెరుగుదల
చైనాలో దేశీయంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ విదేశాల నుంచి కరోనాతో వచ్చిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా గురువారం 39 కొత్త కరోనా కేసులు నమోదు కాగా వారంతా విదేశాల నుంచి వచ్చినట్లు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. దీంతో చైనాలో వీరి సంఖ్య 228కి పెరిగింది. 

అర్జెంటీనా లాక్‌డౌన్‌
దక్షిణ అమెరికాలో కరోనా ప్రభావంతో అర్జెంటీనా లాక్‌ డౌన్‌ అయింది. పౌరులు ఇళ్ల నుంచి బయటికి రావడాన్ని నిషేధించారు. మార్చి ఆఖరు వరకూ ఆహారపదార్థాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అర్జెంటీనాలో ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. 128 మంది వైరస్‌ బారిన పడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,45,652కు చేరుకుంది. మరణాల సంఖ్య 10,050గా నమోదైంది.

దేశం  బాధితులు  మృతులు
చైనా 80,967   3248
ఇటలీ 41,035   3405
ఇరాన్‌ 18,407 1284
స్పెయిన్‌ 18,077  831
జర్మనీ  15,320 44
యూఎస్‌ఏ 14,322  218
ఫ్రాన్స్‌ 10,995 372q
ద.కొరియా  8,652  94
స్విట్జర్లాండ్‌ 4,222   43
యూకే 3,269   144
భారత్‌ 206 4

            

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని