ముంబయి బంద్‌..!

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి సహా మరికొన్ని నగరాల్లో దుకాణాలు, కార్యాలయాలు పూర్తిగా మూసివేయాలని ముఖ్యమంత్రి........

Published : 20 Mar 2020 14:47 IST

ముంబయి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి సహా మరికొన్ని నగరాల్లో దుకాణాలు, కార్యాలయాలు పూర్తిగా మూసివేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు సైతం 25 శాతం మంది ఉద్యోగులతో పనిచేయనున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ నగరాలైన పుణె, నాగ్‌పూర్‌కూ ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. మార్చి 31 వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలు, అత్యవసర సేవలకు మాత్రం దీని నుంచి మినహాయింపునిచ్చారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. కరోనా మహమ్మారి జయించాలంటే ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. 

పరీక్షలు లేకుండానే తరువాతి తరగతులకు..

మరోవైపు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ ప్రకటించారు. అందరినీ తర్వాతి తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక పదో తరగతి విద్యార్థులకు రెండు పేపర్లు మాత్రమే మిగిలిపోయాయని అవి యథాతథంగా కొనసాగుతాయన్నారు. తొమ్మిది, పది తరగతుల వారికి ఏప్రిల్‌ 15 తర్వాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

దిల్లీలోనూ దుకాణాలు మూత..

దిల్లీలోనూ ఇదే తరహాలో దుకాణాలన్నింటినీ మూసివేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ఆదేశించారు. ఔషధాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. దిల్లీలో ఇప్పటి వరకు 17 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.  

భారత్‌లో ఇప్పటి వరకు 206 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలోనే 52 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క పుణె జిల్లాలోనే 21 మందికి వైరస్‌ సోకినట్లు ధ్రువీకరించారు. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో సీఎం కఠిన చర్యలకు ఉపక్రమించక తప్పలేదు. భారత్‌లో కరోనా వల్ల ఇప్పటి వరకు నలుగురు మృత్యువాతపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని