రైలు ప్రయాణం రద్దుచేస్తే పూర్తి సొమ్ము వాపసు

రైలు ప్రయాణాలు రద్దు చేసుకున్న ప్రయాణీకులకు పూర్తి టికెట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది.

Updated : 21 Mar 2020 14:49 IST

దిల్లీ: రైలు ప్రయాణాలు రద్దు చేసుకున్న వారికి టికెట్‌ సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 15 మధ్యకాలంలో ప్రయాణించేందుకు చేసుకున్న రిజర్వేషన్లకు ఈ సౌకర్యం వర్తిస్తుందని అధికారులు వివరించారు. బహిరంగ స్థలాల్లో అనవసర రద్దీని నిరోధించేందుకు, సామాజిక దూరాన్ని ప్రోత్సహించేందుకు తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు రైల్వేశాఖ తెలిపింది. ఇటీవలి కాలంలో మొత్తం 245 రైలు సర్వీసులను రద్దు చేసిన రైల్వేశాఖ, సంబంధిత ప్రయాణీకులకు పూర్తి మొత్తాన్ని వాపసు చేసిన సంగతి తెలిసిందే. కాగా, నడుస్తున్న రైళ్లలో రిజర్వేషన్లను రద్దు చేసుకున్నా... సర్వీసు ఛార్జీలు మినహాయించకుండా పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఆ శాఖ తాజా ప్రకటనలో వివరించింది. 

జనతా కర్ఫ్యూ... తిరగని రైళ్లు

జనతా కర్ఫ్యూ సందర్భంగా... దేశంలోని పాసింజర్‌ రైళ్లు శనివారం అర్ధ రాత్రి నుంచి ఆదివారం రాత్రి 10 గంటల వరకు నడవవని రైల్వేశాఖ ప్రకటించింది. ఇక మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి తిరగవు. కాగా, ఇంటర్‌సిటీ రైళ్లను కూడా ఆదివారం రాత్రి 10 గంటల వరకు నిలిపివేస్తామని రైల్వే అధికారులు వివరించారు. ఆపై ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లోని సబర్బన్‌ రైలు సర్వీసుల సంఖ్యను పరిమితం చేస్తున్నామని వారు ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని