13వేలు దాటిన కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పట్టును బిగుస్తోంది. తాజాగా 184 దేశాలకు వైరస్‌ విస్తరించింది. అనేక దేశాలను నిర్బంధంలోకి నెట్టింది. ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసింది.......

Updated : 22 Mar 2020 11:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పట్టును బిగుస్తోంది. తాజాగా 184 దేశాలకు వైరస్‌ విస్తరించింది. అనేక దేశాలను నిర్బంధంలోకి నెట్టింది. ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేసింది. తొలుత వెలుగులోకి వచ్చిన చైనాలో వైరస్‌ భారీగా తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. మూడు రోజుల వ్యవధి తర్వాత అక్కడ శనివారం ఒక్క కేసు నమోదైంది. అయితే విదేశాల నుంచి వచ్చిన 45 మందిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైరస్‌ మళ్లీ విజృంభించకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. శనివారం మొత్తం 46 కొత్త కేసుల్ని నిర్ధారించారు. దీంతో వైరస్‌ సోకినట్లు గుర్తించిన వారి సంఖ్య 81,054కు పెరిగింది. శనివారం ఆరుగురు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 3,261కి చేరింది. ఇప్పటి వరకు 72,244 మంది కోలుకొని ఇళ్లకు చేరగా మరో 5,549 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.

> ఇప్పటి వరకు వైరస్‌ తీవ్రత కాస్త తక్కువగా ఉన్న ఆఫ్రికా ఖండంలోనూ కఠిన ఆంక్షలు ప్రారంభమయ్యాయి. తమ దేశంలోని ఎయిర్‌పోర్టులన్నింటినీ మూసివేస్తున్నట్లు నైజీరియా శనివారం ప్రకటించింది. రువాండాలో ప్రజా రవాణాను రెండు వారాల పాటు పూర్తిగా నిషేధించారు. ఆఫ్రికాలో మొత్త 54 దేశాల్లో 41 దేశాలకు వైరస్‌ పాకింది. శనివారం అంగోలా, ఎరిత్రియాలో తొలి కేసులు నమోదయ్యాయి. కాంగోలో తొలి మరణం సంభవించింది. 

> ఇరాన్‌లో శనివారం 123 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1556కు చేరింది. మరో 966 కొత్త కేసులు నమోదవడంతో బాధితుల సంఖ్య 20,610కి పెరిగింది. అయితే మరో 15 రోజుల్లో వైరస్‌ వ్యాప్తిని అదుపులోకి తెస్తామని అధ్యక్షుడు హసన్‌ రౌహానీ హామీ ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు మొత్తం 7,635 మంది కోలుకున్నారని తెలిపారు.

> కరోనా వైరస్‌ వల్ల ఏర్పడిన ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 38 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ప్రజల సాధారణ కార్యకలాపాలు స్తంభించడంతో ఆర్థిక రంగం తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్న నేపథ్యంలోనే తాజా చర్యలు చేపట్టామని ప్రధాని స్కాట్‌ మోరిసన్ తెలిపారు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించగా.. 1286 మంది బాధితులుగా మారారు.

> ఫ్రాన్స్‌లో కరోనా పోరులో భాగంగా హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిఘా వేసేందుకు వీటిని ఉపయోగించనున్నారు. ఇప్పటికే ప్రజలు రెండు వారాల పాటు ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో ఇప్పటి వరకు వైరస్‌ వల్ల 372 మంది మరణించగా.. 9000 మందికి సోకినట్లు నిర్ధారణ అయింది. బయటకు రావడానికి ప్రభుత్వం ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రం తప్పనిపరని అధికారులు తెలిపారు. లేనిపక్షంలో 135 యూరోల జరిమానా తప్పదని హెచ్చరించారు. 

> అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కార్యాలయంలోని ఓ అధికారికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో పెన్స్‌ సహా ఆయన సతీమణి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారికి వైరస్‌ నెగెటివ్‌ అని తేలింది. అమెరికాలో ఇప్పటి వరకు 348 మంది చనిపోగా.. 26,867 మంది వైరస్ బాధితులుగా మారారు.

> కరోనా కట్టడికి చేస్తున్న పోరును స్పెయిన్‌ మరింత ఉద్ధృతం చేసింది. క్షేత్రస్థాయిలో నిర్మిస్తున్న ఆస్పత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. అలాగే మరో 52 వేల వైద్య సిబ్బంది రంగంలోకి దింపింది. రానున్న రోజుల్లో మరింత దుర్భరమైన సమయాన్ని ఎదుర్కోబోతున్నామని ప్రధాని పెడ్రో శాంచెజ్‌ ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

> బొలీవియాలో మే నెలలో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల్ని అక్కడి ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి అక్కడ దేశవ్యాప్తంగా స్వీయ నిర్బంధం పాటించనున్నారు. 1.15 కోట్ల జనాభా ఉన్న బొలీవియాలో ఇప్పటి వరకు 19 కరోనా కేసులు నమోదయ్యాయి. 

> చిలీలో శనివారం తొలి కరోనా మరణ సంభవించింది. 24 గంటల్లో 104 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 500కు చేరింది. ప్రజలలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదు..

దేశం  బాధితులు మృతులు
ఇటలీ  53,578 4,825
చైనా 81,054 3,261
ఇరాన్‌ 20,610 1,556
స్పెయిన్‌ 25,496  1,381
ఫ్రాన్స్‌ 14,459  562
అమెరికా 26,867  348
భారత్‌ 324 04
ప్రపంచవ్యాప్తంగా 3,08,257 13,068 

           

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని