
కరోనా ఎఫెక్ట్: రైల్వేశాఖ కీలక నిర్ణయం
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు ప్యాసెంజర్ సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడవనున్నాయని తెలిపింది. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం నుంచే ప్రధాన సర్వీసుల్ని రైల్వే విభాగం రద్దు చేసింది. తాజాగా అన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే ప్రారంభమైన రైళ్లు మాత్రం వాటి గమ్య స్థానాలను చేరే వరకు అనుమతిస్తామని తెలిపింది.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు ప్రధాని పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. స్వచ్ఛందంగా జనాలంతా ఇళ్లకే పరిమితమై వైరస్‌ను ఓడించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు దేశంలో కరోనా మృతుల సంఖ్య ఆరుకి చేరింది. ఈ ఒక్కరోజే ఇద్దరు చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక దేశంలో వైరస్ బారినపడ్డవారి సంఖ్య 324కు పెరిగింది.