క్వారంటైన్‌లోకి జర్మనీ ఛాన్స్‌లర్‌

కరోనా వైరస్‌ దేశాధినేతల్ని సైతం వణికిస్తోంది. తాజాగా జర్మనీ ఛాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కెల్‌ ఆదివారం నుంచి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. గత శుక్రవారం ఆమెను కలిసిన ఓ వైద్యుడికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.......

Published : 23 Mar 2020 08:40 IST

ఆమెను కలిసిన వైద్యుడికి సోకిన కరోనా

బెర్లిన్‌: కరోనా వైరస్‌ దేశాధినేతల్ని సైతం వణికిస్తోంది. తాజాగా జర్మనీ ఛాన్స్‌లర్‌ ఎంజెలా మెర్కెల్‌ ఆదివారం నుంచి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. గత శుక్రవారం ఆమెను కలిసిన ఓ వైద్యుడికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో తనకు తాను స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నానని ప్రకటించారు. శుక్రవారం ఆమె ‘న్యూమొకోకస్‌ బ్యాక్టీరియా’కు సంబంధించిన వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఆ వ్యాక్సిన్‌ ఎక్కించిన వైద్యుడికే తాజాగా వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇక నుంచి ఛాన్స్‌లర్‌కు రోజూ వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని ఆమె అధికార ప్రతినిధి తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతానికి ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆమెకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని.. ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వెల్లడించారు.  

క్వారంటైన్‌లోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందే మెర్కెల్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో వైరస్‌ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు గుమికూడడంపై పూర్తిగా నిషేధం విధించారు. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న ఇతర చర్యలను ప్రకటించారు. సోమవారం క్యాబినెట్‌ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఐరోపా నిర్బంధం వల్ల దెబ్బతిన్న జర్మనీ ఆర్థిక వ్యవస్థకు 822 బిలియన్‌ యూరోల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై క్యాబినెట్లో చర్చించి ఆమోదింపజేసుకోవాలని యోచించారు. జర్మనీలో ఇప్పటి వరకు 94 మంది మృతిచెందగా.. 24,873 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. 

కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భార్య సోఫీకి వైరస్‌ సోకడంతో ఆయన నిర్బంధంలో ఉన్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ని కలిసిన వారిలో కొంతమందికి వైరస్‌ సోకడంతో ఆయన కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఇదే తరహాలో పలువురు దేశాధినేతలు సైతం వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని