రాజస్థాన్‌లో లక్ష ఐసోలేషన్‌ పడకలు!

రాజస్థాన్‌లో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య క్రమంగా విస్తరిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్ష ఐసోలేషన్‌ పడకల్ని ఏర్పాటు చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆదేశించారు........

Published : 23 Mar 2020 11:08 IST

ఏర్పాటుకు అధికారుల్ని ఆదేశించిన సీఎం గహ్లోత్‌

జైపుర్‌: రాజస్థాన్‌లో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య క్రమంగా విస్తరిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్ష ఐసోలేషన్‌ పడకల్ని ఏర్పాటు చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆదేశించారు. ఇందు కోసం కళాశాలలు, హాస్టళ్లు, ఆస్పత్రులు, హోటళ్లను గుర్తించాలని కోరారు. అనుమానితుల్ని గుర్తించిన వెంటనే ఈ ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆదివారం సాయంత్రం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు. ఈ సమావేశానికి ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, బీఎస్ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ అధికారులనూ ఆహ్వానించారు. వైరస్‌పై చేస్తున్న పోరులో సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరు కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు.   

అనంతరం జిల్లా కలెక్టర్లతో గహ్లోత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజల ప్రాణాలను కాపాడడం కంటే ఏదీ ఎక్కువ కాదని.. ఈ క్రమంలో ఉన్న అన్ని మార్గాల్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి జిల్లాల్లో అనుమానితుల్ని క్వారంటైన్‌ చేయడానికి తగినన్ని పడకలు ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో భారీ ఆంక్షలు విధించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించారు. వైద్యులు, పారమెడికల్‌ సిబ్బంది కోసం రాష్ట్రం ఇప్పటికే ప్రత్యేకంగా రూ.25 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. అలాగే ప్రజలు, వివిధ వర్గాల నుంచి విరాళాలు సేకరించేందుకు ‘రాజస్థాన్‌ చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ కొవిడ్‌-19’ పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్రంలో పర్యాటక రంగం కుదేలైన నేపథ్యంలో ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీ, ఇతర రాయితీలు, మినహాయింపులు ప్రకటించాలని ప్రధాని మోదీకి గహ్లోత్‌ లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని