
‘కరోనాపై కేంద్రం చర్యలు సంతృప్తికరం’
దిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలపై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. విమర్శకులు కూడా ప్రస్తుతం కేంద్రం కృషిని ప్రశంసిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ‘కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు కేంద్రం చేపడుతున్న చర్యలకు మేం ఎంతో సంతృప్తి చెందాం. విమర్శకులు కూడా ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వం మంచి పనిచేస్తోంది. ఇది రాజకీయం కాదు..కానీ జరుగుతున్నది మాత్రం వాస్తవమే’అని వెల్లడించింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ఎన్ రావు, సూర్యకాంత్‌లు కూడా ఉన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, ల్యాబ్‌ల సంఖ్య పెంచుతూ.. కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వాటిని విచారణ సమయంలో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. పిటిషనర్లు తమ వినతుల్ని కేంద్ర ప్రభుత్వానికే సమర్పించాలని సూచించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 415కు చేరిన విషయం తెలిసిందే. కాగా మరో ఏడు మంది మరణించారు. ఈ క్రమంలో కేంద్రం దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లాక్డౌన్ విధించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.