Updated : 23/03/2020 16:58 IST

మీటర్‌ దూరం ఉండి ఇంటర్వ్యూలు చేయండి..

కరోనాతో యుద్ధం జీవితకాల సవాల్‌ : మోదీ

విపత్కర సమయంలో సేవ చేస్తున్న మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు

దిల్లీ: కొవిడ్‌-19 జీవితకాల సవాల్‌ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సరికొత్త, సృజనాత్మక పరిష్కారాలతో ఈ మహమ్మారిని కట్టడి చేయాలని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. ఇప్పటికే కరోనా అంటువ్యాధితో దేశంలో ఏడుగురు మరణించారు. సోమవారం మధ్యాహ్నానికి పాజిటివ్‌ కేసుల సంఖ్య 415కు చేరుకుంది.

‘పాత్రికేయులు, కెమెరా పర్సన్స్‌, సాంకేతిక నిపుణులు దేశానికి అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారు. సానుకూల భావప్రసారంతో నిరాశావాదం, భయాన్ని మీడియా తరిమికొట్టాలి. కొవిడ్‌-19 జీవితకాల సవాల్‌. వినూత్న, సృజనాత్మక పరిష్కారాలతో దానిని తరిమికొట్టాలి’ అని మోదీ అన్నారు. కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమో అర్థంచేసుకొని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

‘ఒక సుదీర్ఘ యుద్ధం మన ముందుంది. ప్రజలకు అర్థమయ్యే సులభ భాషలో సామాజిక దూరం (సోషల్‌ డిస్టెన్స్‌) ఎంత ముఖ్యమో మీడియా తెలియజేయాలి. కీలక నిర్ణయాలు, తాజా విషయాలను వివరించాలి’ అని ప్రధాని అన్నారు. మీడియా ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. వాటి ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. మీడియా సంస్థలు పాత్రికేయులకు ప్రత్యేకమైన మైకులు ఇవ్వాలని సూచించారు. ముఖాముఖి చేసేటప్పుడు కనీసం ఒక మీటరు దూరం ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

శాస్త్రీయ నివేదికలనే మీడియా ప్రసారం చేయాలని మోదీ కోరారు. అవగాహన కలిగిన నిపుణులనే చర్చల్లో భాగస్వాములగా చేసి అసత్యాలు వ్యాపించకుండా చూడాలన్నారు. పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. వైరస్‌ వ్యాపించకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించడమే శరణ్యమన్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని తరచూ జాతినుద్దేశించి ప్రసంగించాలని మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా మోదీని కోరారు. సానుకూల కథనాలు చెప్పాలని, కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి అభిప్రాయలు పంచుకుంటే బాగుంటుందన్నారు. పాత్రికేయులను పరీక్షించేందుకు 24 గంటలు పనిచేసే వైద్యబృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసత్యాలను అడ్డుకొనేందుకు వైద్యులు సహకారం అవసరమన్నారు. ప్రసార భారతి రోజుకు రెండు సార్లు సరైన వివరాలు అందజేస్తే అన్ని చానళ్లు వాటినే ప్రసారం చేయగలవని సూచించారు.

విలువైన సలహాలు ఇచ్చిన మీడియా ప్రతినిధులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్‌ వ్యాపించే ప్రమాదముందని విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. డిజిటల్‌ చెల్లింపులు చేసేలా ప్రోత్సహించాలన్నారు. శాస్త్రీయ రిపోర్టింగ్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, ఐబీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని