అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌: మోదీ

ఈ రోజు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రానున్న 21 రోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచిందని.. భారతీయులు జనతా కర్ఫ్యూని విజయవంతం..

Updated : 24 Mar 2020 22:51 IST

దిల్లీ: ఈ రోజు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రానున్న 21 రోజుల పాటు ఈ లాక్‌డౌన్‌ కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచిందని.. భారతీయులు జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలి. ఒకరికొకరు దూరంగా ఉంటూ ఇళ్లలోనే ఉండాలి.  ఈ విధంగా ఉంటే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలోఉండిపోయాయి. కరోనా వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సవాలు విసురుతూనే ఉంది. కరోనా వ్యాప్తి ఎలా విస్తరిస్తుందో వార్తల్లో చూస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు.

రానున్న 21 రోజులు చాలా కీలకం..

‘జనతా కర్ఫ్యూని ఆబాలగోపాలం కచ్చితంగా పాటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకుని తీరాలి. కొంత మంది నిర్లక్ష్యం ప్రజలందరినీ ప్రమాదంలోకి నెడుతుంది. ఈ నిర్లక్ష్యం కొనసాగితే దేశం భారీమూల్యం చెల్లించాల్సి వస్తుంది. రెండు రోజులుగా దేశంలోని అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ విధించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటుంది. ఇళ్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం. ప్రతి నగరం, ప్రతి ఊరు, ప్రతి పట్టణం, ప్రతి వీధిలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. ఇది కర్ఫ్యూ తరహా వాతావరణం.. ప్రతిఒక్కరూ పాటించాలి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారు. రాబోయే 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకోపోతే తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు. కొన్నాళ్లపాటు ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన మానుకోండి. ప్రజలంతా ఒకే పని చేయాలి.. ఇళ్లలోనే ఉండాలి. ఈ లాక్‌డౌన్‌ నిర్ణయం ప్రతి ఇంటికి లక్ష్మణరేఖ’ అని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 

ప్రధాని నుంచి గ్రామవాసుల వరకు..

‘కరోనా సోకినవాళ్లు తొలుత సాధారణంగానే ఉంటారు, అలాగని ఇతరులను కలిసే ప్రయత్నం చేయవద్దు. కరోనా లక్షణాలు బయటపడేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. దానివల్ల తెలియకుండానే ఈ వ్యక్తి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. వైరస్‌ సోకిన వ్యక్తి దాన్ని వందల మందికి వ్యాప్తిజేయగలడని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనా వైరస్‌ మొదటి లక్ష మందికి చేరడానికి 67 రోజులు పట్టింది. కేవలం 11 రోజుల్లోనే ఆ సంఖ్య రెండు లక్షలకు చేరింది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల్లోనే 3 లక్షలకు చేరింది.  ఇదే పరిస్థితి కొనసాగితే మరో లక్ష మందికి సోకేందుకు కేవలం 4 రోజులే పడుతుంది. కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుందో చెప్పేందుకు ఈ గణాంకాలే ఉదాహరణ. చైనా, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇరాన్‌ దేశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వైద్య ఆరోగ్య వ్యవస్థలో ఇటలీ ప్రథమ స్థానంలో ఉంది. అలాంటి దేశాన్నే కరోనా అతలాకుతలం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితుల్లో మనకున్న ఏకైక మార్గం సామాజిక దూరం పాటించడమే. ప్రధాని నుంచి గ్రామవాసుల వరకు సామాజిక దూరం పాటించాలి. ఏం జరిగినా ఇంటిచుట్టూ ఉన్న లక్ష్మణరేఖ దాటి రావద్దు. దేశంలో ఏం జరిగినా ఇళ్లలోనే ఉండాలి’ అని ప్రధాని అన్నారు.

వైద్య సదుపాయాల మెరుగుకు రూ. 15 వేల కోట్లు..

‘తొలి ప్రాధాన్యం ఆరోగ్య సేవలకే ఇవ్వాలని రాష్ట్రాలను కోరుతున్నాను. ప్రజలు ఎలాంటి పుకార్లు, వదంతులను నమ్మవద్దు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు, వైద్యుల సలహాలు మాత్రమే పాటించడం అవసరం. వ్యాధి లక్షణాలు కనిపిస్తే.. వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు తీసుకోవద్దు. 21 రోజులు పెద్ద సమయమే. అయితే.. మీ ప్రాణాలు కాపాడుకోవడానికి, మీ కుటుంబ సభ్యులను కాపాడేందుకు ఇదే కీలక మార్గం. కరోనాపై పోరాడేందుకు మన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు క్రమశిక్షణ, సంయమనం పాటించాలి. ప్రజల ప్రాణాలు కాపాడటమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యం. నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. వైద్య సుదుపాయాల మెరుగు కోసం రూ. 15 వేల కోట్లు కేటాయించాం. ప్రైవేటు సంస్థలు కూడా ప్రభుత్వానికి తోడ్పాటునిస్తున్నాయి. కరోనాను మన దేశం సమర్థంగా ఎదుర్కొంటుందనే నమ్మకం ఉంది. గడప దాటితే కరోనా మహమ్మారిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్లే’ అని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.

‘‘24 గంటలూ పనిచేస్తున్న పోలీసులు, మీడియా ప్రతినిధుల క్షేమం కోసం ప్రార్థిద్దాం. ప్రైవేటు సంస్థలు కూడా ప్రభుత్వానికి  తోడ్పాటునిస్తున్నాయి. ఎలాంటి పుకార్లు, వదంతులు నమ్మవద్దు. నిత్యావసరాలన్నీ ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పేదల ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి’’ అని మోదీ అన్నారు.  

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు