మీకూ కరోనా సోకిందనుకోండి: న్యూజిలాండ్‌ ప్రధాని!

ఒకవేళ మీకు కరోనా వైరస్‌ సోకితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో ప్రస్తుతం అలాగే మసులుకోవాలని న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా అర్డెర్న్‌ ఆ దేశ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కరోనా వైరస్‌పై నిర్లక్ష్యం వహించకుండా వైరస్‌ సోకిందనే భావనతోనే దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Published : 26 Mar 2020 02:18 IST

వెల్లింగ్టన్‌: ఒకవేళ మీకు కరోనా వైరస్‌ సోకితే ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారో ప్రస్తుతం అలాగే మసులుకోవాలని న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా అర్డెర్న్‌ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. కరోనా వైరస్‌పై నిర్లక్ష్యం వహించకుండా వారికే వైరస్‌ సోకిందనే భావనతోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలపాటు లాక్‌డౌన్‌ విధిస్తూ న్యూజిలాండ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో దేశప్రజలనుద్ధేశిస్తూ ప్రధాని జసిండా ఈ వ్యాఖ్యలు చేశారు.  

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా గొలుసుకట్టు వ్యాప్తిని కట్టడి చేసేందుకే నాలుగువారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని పార్లమెంట్‌లో ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌-19తో ఒక్కమరణం కూడా సంభవించనప్పటికీ ముందు జాగ్రత్తలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. లాక్‌డౌన్‌ విధించిన ఈ నెలరోజుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఈ సమయంలో ప్రతివ్యక్తి స్వతహాగా ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితి చేయిదాటితే మాత్రం సైన్యాన్ని రంగంలోకి దించాల్సివస్తుందన్నారు. ఈ తాజా నిర్ణయంతో దేశంలోని మొత్తం 50లక్షల జనాభా పూర్తిగా వారి ఇళ్లకే పరిమితం అయ్యేఅవకాశం ఉంది. న్యూజిలాండ్‌లో ఒకేసారి 50కొవిడ్‌-19 కేసులు నమోదుకావడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 205కు చేరింది. దీంతో వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా న్యూజిలాండ్‌ ప్రభుత్వం నెలపాటు లాక్‌డౌన్‌ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు ఇప్పటికే చాలా దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాయి. 130కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్‌ కూడా 21రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని