మృతులు 20,000, లాక్‌డౌన్‌లో 300 కోట్లమంది

కరోనాపై చర్యల ఫలితంగా మూడు బిలియన్లు అంటే సుమారు 300 కోట్ల మందికి పైగా ప్రజలు క్వారంటైన్‌లో ఉంటున్నారు.

Updated : 26 Mar 2020 11:52 IST

హుబెయిలో ఆంక్షల సడలింపు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చర్యల ఫలితంగా మూడు బిలియన్లు అంటే 300 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉంటున్నారు. కాగా, అంతర్జాతీయంగా కరోనా మృతుల సంఖ్య బుధవారం నాటికి 20,000కు చేరుకుంది. ఇక కరోనా బాధితుల సంఖ్య 4,50,000 కు చేరిన నేపథ్యంలో... ప్రపంచ దేశాల ఏకీకృత చర్యల ద్వారా మాత్రమే వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మరోమారు స్పష్టం చేశారు. 

* అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటివరకు 68,472 కొవిడ్‌-19 కేసులు నమోదు కాగా... 1,000మందికి పైగా చనిపోయినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు. 

ఇక, రష్యాలో ఇద్దరు మృతి చెందటంతో వారం రోజుల పాటు దేశంలో సెలవులు ప్రకటించారు. 

బ్రిటన్‌ సింహాసన వారసుడు ప్రిన్స్‌ ఛార్లెస్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అయితే ఆయనలో కరోనా లక్షణాలు బలహీనంగా ఉన్నాయని అధికారులు వివరించారు.

స్పెయిన్‌లో మరణాలు గత 24 గంటల్లో 378 మంది మరణించటంతో... మొత్తం అక్కడి మృతుల సంఖ్య 3,400 దాటింది. 

అదే విధంగా ఇటలీలో బుధవారం ఒక్కరోజే 683 మంది మరణించటంతో మొత్తం మృతుల సంఖ్య 7,503కు చేరుకుంది. 

ఇరాన్ కరోనా మృతుల సంఖ్య 2,000 దాటింది. 

ఆఫ్రికాలోని మాలిలో మొదటి మృతి నమోదయింది. 

ఇది ఇలా ఉండగా కరోనా వైరస్‌ మూలస్థానమైన చైనా పట్టణం హుబెయిలో మాత్రం కఠిన ఆంక్షలపై కాస్త సడలింపు లభించింది. కొత్త కేసులు నమోదు కాకపోవటంతో ప్రజల కదలికలపై ఆంక్షలను తొలిసారిగా సడలించారు. జనవరి తర్వాత ఇన్నాళ్లకు మొదటిసారి ప్రజారవాణాలో ప్రయాణించటానికి దొరికిన అవకాశాన్ని వినియోగించుకోవటానికి అక్కడి ప్రజలు మళ్లీ పోటెత్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని