వైద్యునికి కరోనా..క్వారంటైన్‌లో 800మంది !

విధులు నిర్వహిస్తున్న వైద్యునికి కరోనా వైరస్‌ నిర్థారణ కావడంతో ప్రజలు ఆందోళనకు గురైన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. దిల్లీలోని మొహల్లా క్లినిక్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యునికి తాజాగా కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు ఆరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ వెల్లడించారు.

Published : 26 Mar 2020 17:19 IST

దిల్లీ: ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యునికి కరోనా వైరస్‌ నిర్థారణ కావడంతో ప్రజలు ఆందోళనకు గురైన ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. దిల్లీలోని మొహల్లా క్లినిక్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యునికి తాజాగా కొవిడ్‌-19 సోకినట్లు ఆరాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ వెల్లడించారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంలో గత కొన్నిరోజులుగా ఆసుపత్రికి వచ్చిన దాదాపు 800మంది  14రోజులపాటు వారి ఇళ్లలోనే నిర్బంధంలో ఉండాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా మార్చి 12నుంచి 18వరకు ఈ ఆసుపత్రికి వచ్చిన రోగులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

ఈశాన్య దిల్లీలోని మౌజ్‌పూర్‌లో నివాసముండే ఓ మహిళ ఈ మధ్యే దుబయి నుంచి దిల్లీ చేరుకుంది. అనంతరం అనారోగ్యానికి గురికావడంతో ఆ మహిళ స్థానిక మొహల్లా క్లినిక్‌ను సందర్శించింది. ఆ మహిళకు కొవిడ్-19 లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. ఆ మహిళకు మొహల్లా క్లినిక్‌లో పరీక్షించిన వైద్యునికి కూడా కొవిడ్‌-19 సోకినట్లు తాజాగా వెల్లడైంది. అంతేకాకుండా వైద్యుని భార్య, కూతురికి కూడా కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారందరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు స్థానికంగా ఉన్నవారితో పాటు క్లినిక్‌కు వచ్చిన దాదాపు 800మందిని వారి కుటుంబ సభ్యులను ఇళ్లలోనే 14రోజులపాటు నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు.

దేశ రాజధాని దిల్లీలో ఇప్పటికే 35 కరోనా కేసులు నిర్ధారణ కాగా ఒకరు మరణించారు. దేశవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 649కు చేరగా ప్రస్తుతం 593మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కొవిడ్‌-19 కారణంగా మరణించిన వారిసంఖ్య 13కు చేరింది. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం దిల్లీలోని చాలా బస్తీల్లో మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విధినిర్వహణలో ఉండే వైద్యులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts