హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడకంపై కఠిన నిబంధనలు

భారత్‌లో కరోనా వైరస్‌ చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ప్రభుత్వం షెడ్యూల్‌ హెచ్‌1 ఔషధాల జాబితాలోకి చేర్చింది.

Updated : 27 Mar 2020 19:04 IST

హెచ్‌1 ఔషధాల పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ప్రభుత్వం షెడ్యూల్‌ హెచ్‌1 ఔషధాల జాబితాలోకి చేర్చింది. ఈ మేరకు కేంద్రం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కలిగిన ఔషధాలను సాధారణంగా మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నయం చేయటానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సమర్థంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఇటీవల ప్రకటించింది. అయితే కరోనా రాకుండా ఉండాలంటే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడితే సరిపోతుందన్న తప్పు అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో వ్యాప్తిస్తోంది. కరోనా సోకిన వారు మాత్రమే దీనిని వాడాలనీ... లేకుంటే అనేక దుష్ప్రభావాలు ఉంటాయనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను విచక్షణ రహితంగా కొనుగోలు చేయటం మొదలుపెట్టారు. ఈ ధోరణి మరిన్ని సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. 

ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను హెచ్‌1 ఔషధంగా ప్రకటించింది. ఈ ఆదేశాల ప్రకారం... వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఈ ఔషధాన్ని విక్రయించటం చట్టవిరుద్ధం. అంతేకాకుండా, మెడికల్‌ దుకాణాలు ఈ ఔషధ విక్రయానికి సంబంధించిన వివరాలతో కూడిన ఓ ప్రత్యేక రిజిస్టర్‌ను మూడు సంవత్సరాల పాటు నిర్వహించాలి. దానిలో ఔషధం పేరు, పరిమాణం, సూచించిన వైద్యుడి పేరు, రోగి పేరు, తదితర వివరాలను నమోదు చేయాలి. 

ఇక హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కలిగిన మందుల స్ట్రిప్‌పై ఎర్రరంగులో Rx అనే చిహ్నంతో పాటు, ‘‘వైద్య సలహా లేకుండా దీనిని వాడితే ప్రమాదం... రిజిస్టర్డ్‌ వైద్యుల సూచన మేరకే దీనిని విక్రయించాలి’’ అని ఉంటుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కలిగిన ఏ ఔషధం విక్రయానికైనా ఈ నిబంధనలు వర్తిస్తాయని అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా దేశంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కొరత రాకుండా ఈ ఔషధ ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు