లాక్‌డౌన్: చదువుకు దూరం కాకూడదని...

నానాటికీ విస్తరిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు భారత ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పాఠాలను బోధించేందుకు.....

Published : 27 Mar 2020 23:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నానాటికీ విస్తరిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్‌ మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పాఠాలను బోధించేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్లు యూనిసెఫ్‌ ప్రకటించింది. అధికారిక గణాంకాల ప్రకారం దాదాపు 20 కోట్లమంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న 50 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరంతా తరగతులకు దూరంగా కానున్నారు. కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది విద్యార్థులు కరోనా కారణంగా విద్యాభ్యాసానికి దూరంగా ఉన్నట్లు యూనిసెఫ్ పేర్కొంది. దీంతో వారందరికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యను అందించి పాఠశాల విద్యను కాపాడేందుకు యూనిసెఫ్ అదనపు నిధులతో దాదాపు 145పైగా వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేయనుంది. ఇందుకోసం 17 రాష్ట్రాల్లోని విద్యాశాఖలకు యూనిసెఫ్ తోడ్పాటును అందివ్వనుంది.

 పాఠశాల వయస్సు విద్యార్థులు, ఇంట్లోనే ఉండి నేర్చుకునే విధంగా రీడింగ్ మెటీరియల్, రేడియో, టివీ, ఆన్‌లైన్‌ ప్రోగ్రాములు వంటి వాటి ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. దీనివల్ల పాఠశాలలు పునః ప్రారంభమైనప్పుడు విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండవచ్చు అని యూనిసెఫ్‌ అభిప్రాయపడింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి మద్దతుగా పాఠశాల వయస్సు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి వివిధ పద్ధతుల్లో తమ వంతు సహకారం అందివ్వనున్నట్లు యూనిసెఫ్ తెలిపింది. 

‘‘కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కువ శాతం పాఠశాలలు మూతబడ్డాయి. మన పిల్లల విద్యను, సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునేందుకు కరోనాకి వ్యతిరేకంగా మనమంతా కలిసి పోరాడాలి. లేకుంటే కొన్ని తరాల వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎబోలా వ్యాప్తి సమయంలో పాఠశాలలు మూతబడి పునః ప్రారంభమైనప్పుడు ఎక్కువ శాతం విద్యార్థులు తిరిగి తరగతులకు హాజరుకాలేదు. అటువంటివి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉన్నప్పుడు వారికి ప్రత్యామ్నయ మార్గాల ద్వారా విద్యను అందివ్వగలిగితే వారంతా తిరిగి పాఠశాలకు వచ్చేట్లు చేయవచ్చు’’ అని యూనిసెఫ్‌ అంతర్జాతీయ విద్య విభాగం చీఫ్ రాబర్ట్‌ జెన్కిన్స్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని