కరోనా.. వీరి ప్రేమను అడ్డుకోలేకపోయింది..

మహమ్మారి కరోనాతో యావత్‌ ప్రపంచమే లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. విమానాలు, రైళ్లు, బస్సులు అన్నీ వాహనాలు నిల్చిపోయాయి...

Published : 30 Mar 2020 16:22 IST

బెర్లిన్‌ : మహమ్మారి కరోనాతో యావత్‌ ప్రపంచమే లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. విమానాలు, రైళ్లు, బస్సులు అన్నీ వాహనాలు నిల్చిపోయాయి. మార్కెట్లు బంద్‌ అయ్యాయి. జనజీవనం స్తంభించింది. కోట్లాదిమంది తమ ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే ఈ వృద్ధ ప్రేమికులను మాత్రం కరోనా ఏ రకంగానూ అడ్డుకోలేకపోవడం విశేషం..

ఆమెకు 85 ఆయనకు 89

అవును ఈ ప్రేమికుల వయసు ఇది.. అతని పేరు హన్‌సెన్‌ ఆమె పేరు ఇంగా రాస్‌ముసెన్‌.  ఆయన జర్మనీలో నివసిస్తుండగా ఆమె డెన్మార్క్‌లో ఉంటోంది. కరోనా నేపథ్యంలో డెన్మార్క్‌ తన సరిహద్దులను మూసివేసింది. అనంతరం కొద్దిరోజులకే జర్మనీ కూడా మూసివేసింది. దీంతో ప్రతిరోజు కలుసుకొని కబుర్లు చెప్పుకునే వీరికి చాలా కష్టం కలిగింది. అయితే ప్రతిరోజు తమ దేశ సరిహద్దుల వరకు చేరుకుంటున్నారు. బారికేడ్‌కు ఇరుపక్కల కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఫ్లాస్క్‌లో తెచ్చిన కాఫీ ఇచ్చిపుచ్చుకుంటారు. 

ఎలా పరిచయమయ్యారంటే..

రెండేళ్ల క్రితం వారు ఒక కార్యక్రమంలో పరిచయమయ్యారు. అప్పటికే వారు తమ జీవిత భాగస్వాములను కోల్పోయివున్నారు. వారి మధ్య మాటలు కొనసాగేవి. అనంతరం ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. తమ ప్రేమను బయటపెట్టారు. అప్పటి నుంచి ఇద్దరూ ప్రతిరోజూ షికార్లు చేసేవారు. అయితే తాజాగా కరోనా నిబంధనలు వారికి అడ్డంకిగా మారాయి. అయితే వాటిని లెక్కచేయక ప్రతిరోజూ సరిహద్దుల వద్ద కలుసుకొని కబుర్లతో కాలం వెల్లదీస్తున్నారు. 

భవిష్యత్తులో టూర్లకు వెళుతాం..
కరోనా నిషేధాజ్ఞలు ఎత్తివేసిన అనంతరం ఇద్దరం కలిసి మరిన్ని ప్రాంతాల్లో పర్యటిస్తామని వారు చెబుతున్నారు. జర్మనీ- డెన్మార్క్‌ సరిహద్దుల్లో ఈ జంటను చూసిన భద్రతాబలగాలు వారికి రక్షణగా ఉండటంతో పాటు ఇరువురిని వారి వారి ఇళ్లకు తరలించడంలో సాయం అందిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు