ఒకే కుటుంబంలో 25మందికి కరోనా

రెండు సంవత్సరాల బాలుడికి కరోనా వైరస్‌ సోకినట్టు ఈరోజు వెల్లడవటంతో మహారాష్ట్రలోని ఓ కుటుంబంలో 25 మందికి కొవిడ్‌-19 సోకినట్టు నిర్ధారణ అయింది.

Published : 31 Mar 2020 01:39 IST

పుణె:  మహారాష్ట్రలోని ఓ కుటుంబంలో 25 మందికి కొవిడ్‌-19 సోకినట్టు నిర్ధారణ అయింది. అంటువ్యాధి మరింత వ్యాప్తించకుండా నిరోధించే చర్యల్లో భాగంగా ప్రభుత్వం బాధితేలన్న ప్రాంతానికి ముగ్గురు వైద్యుల బృందాన్ని  పంపింది. వివరాల్లోకి వెళ్తే...

సదరు కుటుంబానికి చెందిన నలుగురు సౌదీ అరేబియా నుంచి ఈ మధ్యనే తిరిగివచ్చారు. వారికి కరోనా పరీక్షలు జరుపగా, వ్యాధిసోకినట్టు మార్చి 14న నిర్ధారణ అయింది. అనంతరం ఆ కుటుంబంలో మిగిలిన వారందరికీ కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించారు. వెలువడిన ఫలితాల్లో... మార్చి 25న మరో ఐదుగురికి, మార్చి 26న ముగ్గురికి, శుక్రవారం మిగిలిన 12 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కాగా వారందరికీ మిరాజ్‌ ఆస్పత్రిలో చికిత్స అందచేస్తున్నారు. ఆ ఆస్పత్రిని కొవిడ్‌-19 చికిత్సా కేంద్రంగా మార్చారు. ఐతే, బంధువులందరూ ఆస్పత్రిలోనే ఉండటంతో రెండేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను కూడా వారితోనే ఉంచాల్సి వచ్చిందని వైద్యాధికారులు చెప్పారు. 

మొదట మార్చి 25న చేసిన కరోనాపరీక్షలో ఆ ఇద్దరు చిన్నారులకు నెగటివ్‌ వచ్చింది. అనంతరం మరలా నమూనాలు సేకరించి పరీక్షించగా వారిలో ఒకరికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈసారి పరీక్షలో నెగిటివ్‌ వచ్చిన చిన్నారిని వారి దూరపు బంధువుల వద్దకు పంపినట్టు అధికారులు తెలిపారు. తాజాగా పుణెకు చెందిన మరో బంధువుకు కూడా కరోనా నిర్ధారణ కావటంతో ఈ సంఖ్య 25కు చేరుకుంది. కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకు 193 మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని