వలస కూలీలతో గ్రామాలకు వైరస్‌!:కేంద్రం

లాక్‌డౌన్‌ సమయంలో నగరాల నుంచి వలస కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోతున్నారు. ముఖ్యంగా దిల్లీ నుంచి సమీప రాష్ట్రాలకు వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు కాలినడక తరలివెళ్తున్న ఘటనలు దేశాన్నే కలచివేశాయి.

Published : 31 Mar 2020 18:55 IST

దిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలో నగరాల నుంచి వలస కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోతున్నారు. ముఖ్యంగా దిల్లీ నుంచి సమీప రాష్ట్రాలకు వేల సంఖ్యలో కార్మికులు, వలస కూలీలు కాలినడక తరలివెళ్తున్న ఘటనలు దేశాన్నే కలచివేశాయి. అయితే ఇలా వెళ్తున్న వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరి ద్వారా కరోనా వైరస్‌ గ్రామాలకు సోకే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. ఈ సమయంలో నగరాల నుంచి తమ సొంత ప్రాంతాలకు కాలినడకన తరలివెళ్తున్న వారినుంచి గ్రామాలకు వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలా వెళుతున్న వారిలో 30శాతం మంది కరోనా వైరస్‌ను తమవెంట గ్రామాలకు తీసుకెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఇలా గ్రామాలకు కాలినడకన వెళ్తున్న దాదాపు 22లక్షల మంది రోజువారీ, వలస కూలీలకు వారు వెళ్తున్న దారిలోనే భోజన, వసతి సదుపాయాలను కల్పించినట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రస్తుతం ఏ ఒక్క వలస కూలీ కూడా రోడ్లపైన లేరని..వారందరిని సమీప వసతి కేంద్రాలకు తరలించామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి సుప్రీం కోర్టుకు విన్నవించారు. కరోనా వైరస్‌ కంటే ఎక్కువగా భయమే చంపుతుందని విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లాక్‌డౌన్‌ కారణంగా రోడ్లపై చిక్కుకున్న వలస కూలీలందరికి కచ్చితంగా భోజన, వసతితోపాటు వైద్య సదుపాయాలు కల్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని