ప్రధాని కేర్స్‌కు విరాళాల వెల్లువ

కరోనా వైరస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో వివిధ సంస్థల యాజమాన్యాలు, పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించి తమ ఉదారతను చాటుకుంటున్నారు. తాజాగా పీఎం కేర్స్‌కు ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ. 200 కోట్లు విరాళం ప్రకటించింది.

Published : 31 Mar 2020 22:01 IST

దిల్లీ: కరోనా వైరస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో వివిధ సంస్థల యాజమాన్యాలు, పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించి తమ ఉదారతను చాటుకుంటున్నారు. తాజాగా పీఎం కేర్స్‌కు ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రూ. 200 కోట్లు విరాళం ప్రకటించింది. ఆ సంస్థ ఉద్యోగులు అదనంగా ఒక రోజు వేతనాన్ని పీఎం కేర్స్‌కు అందజేయనున్నారు. ఎస్‌బీఐకి చెందిన 2.56లక్షల మంది ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని పీఎం కేర్స్‌కు అందించాలని నిర్ణయించారు. సుమారు రూ.100 కోట్లు మొత్తాన్ని అందించనున్నారు.

ఇప్పటికే పీఎం కేర్స్‌కు రూ.25 కోట్లు అందజేయనున్నట్టు ప్రకటించిన టీవీఎస్‌ మోటార్స్‌ కంపెనీ తాజాగా తమిళనాడు సీఎం సహాయ నిధికి మరో రూ.5కోట్లు విరాళంగా ప్రకటించింది. అలాగే, కరోనాపై పోరుకు టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ కూడా రూ.80లక్షలు విరాళంగా ప్రకటించారు. ఇందులో ప్రధాని కేర్స్‌ నిధికి రూ.40లక్షలు, మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి రూ.25లక్షలు; లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయం చేస్తున్న జొమాటో ఫీడింగ్‌ ఇండియాకు రూ.5లక్షలు; వీధి కుక్కల సంక్షేమానికి పాటుపడుతున్న ఓ సంస్థకు మరో రూ.5లక్షల చొప్పున ప్రకటించారు. భారత్‌ తిరిగి తన కాళ్లపై తాను నిలబడేలా చేయడం మన బాధ్యత అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా, ఆమె భర్త నెక్‌ జోన్స్‌, మరో నటి కత్రినా కైఫ్‌ కూడా కరోనా నేపథ్యంలో విరాళాలు ప్రకటించారు. అయితే, ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని